Page Loader
Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత.. జైషే స్థావరం ఇలా ఉంది.. వీడియో విడుదల చేసిన బీజేపీ 
ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత.. జైషే స్థావరం ఇలా ఉంది.. వీడియో విడుదల చేసిన బీజేపీ

Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత.. జైషే స్థావరం ఇలా ఉంది.. వీడియో విడుదల చేసిన బీజేపీ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 07, 2025
04:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి కౌంటర్ చర్యగా భారత్ ఉగ్రవాదసంస్థలపై గట్టి బదులు ఇచ్చింది. ముఖ్యంగా లష్కరే తోయిబా,జైషే మహమ్మద్ వంటి తీవ్రవాద ముఠాలను లక్ష్యంగా చేసుకొని,వాటి స్థావరాలపై భారీస్థాయిలో బాంబు దాడులు జరిపింది. ఈదాడులు 'ఆపరేషన్ సిందూర్' పేరిట మెరుపు చర్యలుగా కొనసాగాయి. ఈచర్యలతో ఉగ్రవాద ముఠాలకు తీవ్రమైన దెబ్బతగిలినట్టు తెలుస్తోంది. ప్రత్యేకంగా పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న బహవల్‌పూర్‌లో జైషే మహమ్మద్ ప్రధాన కేంద్రంపై జరిగిన దాడిని కీలక విజయంగా పేర్కొనవచ్చు. ఈ స్థావరం పూర్తిగా ధ్వంసమైనట్టు సమాచారం.ఈ దాడికి సంబంధించిన దృశ్యాలను భారతీయ జనతా పార్టీ ఐటీ విభాగం ఇన్‌ఛార్జ్ అమిత్ మాలవీయ తన 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈదృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

వివరాలు 

దాడి ధాటికి భవనం బాగా దెబ్బతింది

"బహవల్‌పూర్‌లోని మర్కజ్ సుబాన్ అనే ప్రాంతంలో ఉన్న ఈ శిబిరం జైషే మహమ్మద్‌కి ప్రధాన కేంద్రం. గతంలో అనేక ఉగ్రకుట్రలు ఇక్కడే రూపుదిద్దుకున్నాయి. 2019 ఫిబ్రవరిలో జరిగిన పుల్వామా ఉగ్రదాడికి సంబంధించిన పథకం కూడా ఇక్కడే రూపొందించారు. ఆ దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు ఇదే శిక్షణాశిబిరం. ఇప్పుడు ఆ స్థావరాన్ని ధ్వంసం చేయగలిగాం" అని మాలవీయ వివరించారు. ఆయన పోస్ట్‌ చేసిన వీడియోలో దాడికి ముందు, తర్వాత శిబిరం ఎలా ఉందో స్పష్టంగా చూడవచ్చు. దాడి ధాటికి భవనం బాగా దెబ్బతింది. గోడలు కూలిపోవడంతో పాటు భూమిలో ఒక పెద్ద గొయ్యి ఏర్పడింది.

వివరాలు 

ఈ క్యాంపస్‌లో 600 మంది ఉగ్రవాదుల నివాసాలు 

ఈ శిబిరంలో జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబానికి చెందిన పది మంది మృతిచెందినట్టు నివేదికలు చెబుతున్నాయి. అలాగే మసూద్‌కు అత్యంత సన్నిహితులైన నలుగురు అనుచరులు కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ఈ స్థావరాన్ని మసూద్ అజార్ తన నివాసంగా కూడా వినియోగిస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుత జైషే నెంబర్-2 నేత ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్, మౌలానా అమర్ తదితరుల కుటుంబ సభ్యులు కూడా అదే స్థలంలో నివసిస్తున్నట్టు సమాచారం. మొత్తం దాదాపు 600 మంది ఉగ్రవాదుల నివాసాలు ఈ క్యాంపస్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అమిత్ మాలవీయ చేసిన ట్వీట్