దిల్లీలో తెలంగాణ బీజేపీ పెద్దల కీలక మంతనాలు.. ఇవాళ ఫస్ట్ లిస్ట్ ప్రకటించే అవకాశం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల జాబితాను ఇవాళ ప్రకటించేందుకు బీజేపీ రెడి అయ్యింది. ఈ మేరకు తెలంగాణ పార్టీ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డితో పాటు బీజేపీ అగ్రనేతలు దిల్లీకి పయనమయ్యారు. అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు కొనసాగుతుందని, ఈ క్రమంలోనే గురువారం తొలి జాబితాను విడుదల చేయాలని పార్టీ భావిస్తోంది. జాబితా ఖరారు కోసం కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇప్పటికే దిల్లీ చేరుకున్నారు. 35 మంది పేర్లతో తొలి జాబితా విడుదల చేసే అవకాశముందని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. వీలైతే 60 మంది పేర్లతో తొలి జాబితా ప్రకటించేందుకు పార్టీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
దిల్లీ పెద్దలతో కీలక సమావేశం
కాంగ్రెస్, బీఆర్ఎస్ అసంతృప్త నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉన్న దృష్ట్యా అభ్యర్థుల జాబితా ప్రకటన ఆలస్యం అవుతోందని బీజేపీ చెబుతోంది. తెలంగాణ కాషాయ కీలక నేతలు ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలతో నేడు దిల్లీలో సమావేశం కానున్నారు. ఈ మేరకు రోడ్ మ్యాప్ ను రాష్ట్ర నాయకులకు కేంద్రం అధినాయకత్వం ఇవ్వనుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 6వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. ఒక్క కంటోన్మెంట్ స్థానానికే ఏకంగా 66 అప్లికేషన్లు అందడం గమనార్హం. ఈ దఫా తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని కేంద్ర కమలదళపతులు పట్టుదలగా ఉన్నారు.