Delhi New CM: రేపే ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారం.. నేటి సాయంత్రం సీఎం పేరు ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా గురువారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
ఈ సందర్భంగా రాంలీలా మైదానంలో ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.
కొత్త సీఎం ఎంపిక కోసం బుధవారం సాయంత్రం 6:30 గంటలకు ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు.
ఈ సమావేశంలో బీజేపీ శాసనసభాపక్ష నాయకుడిని ఎన్నుకోనున్నారు.
ముఖ్యమంత్రి పదవి రేసులో పలువురు కీలక నేతలు ఉన్నారు. ఎంపిక ప్రక్రియలో పర్వేష్ వర్మతో పాటు ఓ మహిళా నేతకు అవకాశం కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్‌పై విజయం సాధించిన శిఖా రాయ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది.
వివరాలు
15 మంది నేతల పేర్లతో జాబితా సిద్ధం
అదేవిధంగా, ఢిల్లీ బీజేపీ జనరల్ సెక్రటరీ ఆశిస్ సూద్, రేఖా గుప్తా, మాజీ ప్రతిపక్ష నేత విజేందర్ గుప్తా, బ్రాహ్మణ నేత, మాజీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్, వైశ్య నేత జితేంద్ర మహాజన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
అలాగే, మంత్రి పదవుల కోసం దాదాపు 15 మంది నేతల పేర్లతో జాబితాను సిద్ధం చేసినట్లు సమాచారం.
ఈ నెల 20న రాంలీలా మైదానంలో అత్యంత ఘనంగా ప్రమాణస్వీకార వేడుకను నిర్వహించాలని బీజేపీ యోచిస్తోంది.
ఈ కార్యక్రమానికి 50 మంది సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, విదేశీ దౌత్యవేత్తలను ఆహ్వానించాలని భావిస్తోంది.
బీజేపీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, మిత్రపక్షాల నేతలు హాజరుకానున్నారు.
దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు సమాచారం.
వివరాలు
ప్రముఖ నేతలు ఓటమి
ఈ వేడుకను ప్రత్యేకంగా మార్చేందుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అంతేకాదు, ఆధ్యాత్మిక వేత్తలు బాబా రామ్‌దేవ్,స్వామి చిదానంద, బాబా బాగేశ్వర్ ధీరేంద్ర శాస్త్రి, ఇతర మత ప్రముఖులను కూడా ఈ వేడుకకు ఆహ్వానిస్తున్నారు.
సంగీత ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా ఉండనుంది, దీనిని ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్ నిర్వహించనున్నాడు.
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా, బీజేపీ 48, ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాల్లో విజయం సాధించాయి.
27 ఏళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీలో అధికారాన్ని తిరిగి సాధించింది. ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి ప్రముఖ నేతలు ఓటమి చెందగా, అతిషి మాత్రం కల్కాజీ నియోజకవర్గం నుంచి కష్టం మీద విజయం సాధించింది.