Goddess Of Justice: సుప్రీంకోర్టులో న్యాయదేవత విగ్రహంలో మార్పులు.. కళ్ల గంతలు తొలగింపు.. చేతిలోకి రాజ్యాంగం!
"చట్టానికి కళ్లు లేవు" అనే మాటను మనం తరచుగా వింటున్నాం. చాలా మంది ఈ విషయాన్ని అంటుంటారు. అయితే, సుప్రీంకోర్టులోని జడ్జీల లైబ్రరీలో ఏర్పాటు చేసిన న్యాయదేవత విగ్రహంలో కళ్లకు గంతలు తొలగించారు. ఎడమ చేతిలో ఖడ్గం స్థానంలో రాజ్యాంగం ఉంచారు. ఈ విషయంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. న్యాయదేవత కళ్లకు గంతలు తొలగించడం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. దీనిలో, చట్టం గుడ్డిది కాదని స్పష్టం చేయడం ఉద్దేశ్యమని చెప్పవచ్చు.
న్యాయమూర్తుల లైబ్రరీలో కొత్త విగ్రహం
సాధారణంగా, న్యాయదేవత కుడి చేతిలో త్రాసు, ఎడమ చేతిలో ఖడ్గం కలిగి ఉంటాయి. త్రాసు న్యాయానికి ప్రతిబింబంగా, ఖడ్గం తప్పు చేసిన వారికి శిక్ష తప్పదనే ఉద్దేశాన్ని తెలిపే విషయాలు. అయితే, తాజాగా ఎడమ చేతిలో రాజ్యాంగం వస్తోంది, కళ్లకు గంతలు తొలగించారు. కళ్లకు గంతలు చట్టం ముందు సమానత్వాన్ని సూచించడానికి ఉద్దేశించబడ్డాయి. ఇది న్యాయస్థానాల ముందు వచ్చిన వారి సంపద, అధికారం లేదా ఇతర హోదాల గుర్తులను పట్టించుకోకుండా సూచిస్తుంది. ఖడ్గం అధికారాన్ని, అన్యాయాన్ని శిక్షించే శక్తిని సూచిస్తుంది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఆదేశాల ప్రకారం, సుప్రీంకోర్టులోని న్యాయమూర్తుల లైబ్రరీలో కొత్త విగ్రహాన్ని కళ్లు తెరిచి, ఎడమ చేతిలో రాజ్యాంగాన్ని ఉంచారు.
చట్టం ఎప్పుడూ గుడ్డిది కాదు.. అది అందరినీ సమానంగా చూస్తుంది
"న్యాయం గుడ్డికాదని, చట్టానికి కళ్లున్నాయ్" అని చెప్పే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సుప్రీం కోర్టు లైబ్రరీలోని న్యాయదేవత విగ్రహానికి మార్పులు చేశారు. ప్రధాన న్యాయమూర్తి కార్యాలయానికి సంబంధించిన ఉన్నత వర్గాల సమాచారం ప్రకారం, భారతదేశం బ్రిటిష్ వలస పాలన నుంచి ముందుకు సాగాలని, చట్టం ఎప్పుడూ గుడ్డిది కాదని, అది అందరినీ సమానంగా చూస్తుందని జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారని అంటున్నారు. "ప్రధాన న్యాయమూర్తి న్యాయదేవత విగ్రహ రూపాన్ని మార్చాలని అన్నారు.విగ్రహానికి ఒక చేతిలో రాజ్యాంగం ఉండాలి..కత్తి కాదు. తద్వారా ఆమె న్యాయం చేస్తుందని దేశానికి సందేశం వెళ్తుంది.న్యాయస్థానాలు రాజ్యాంగ చట్టాల ప్రకారం న్యాయాన్ని అందజేస్తాయి" అని ప్రధాన న్యాయమూర్తి కార్యాలయ అధికారులు తెలిపినట్టుగా ఎన్డీటీవీ పేర్కొంది.