Rushikonda: రుషికొండ బీచ్‌కు బ్లూఫ్లాగ్ గుర్తింపు తాత్కాలిక రద్దు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో బ్లూఫ్లాగ్ గుర్తింపు పొందిన ఏకైక బీచ్‌గా విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ పేరొందింది. అయితే తాజాగా ఈ గుర్తింపు తాత్కాలికంగా రద్దయింది.
ఈ నేపథ్యంలో శనివారం పర్యాటకశాఖ అధికారులు బీచ్‌లో ఏర్పాటు చేసిన బ్లూఫ్లాగ్ జెండాలను తొలగించారు.
2020లో రుషికొండ తీరంలోని 600 మీటర్ల ప్రాంతాన్ని బ్లూఫ్లాగ్ బీచ్‌గా ధ్రువీకరించారు.
ఈ గుర్తింపును డెన్మార్క్‌కు చెందిన 'ఎఫ్‌ఈఈ' సంస్థ అందిస్తుంది. ఇటీవల బీచ్‌లో శునకాలు ప్రవేశించడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, వ్యర్థాలు పేరుకుపోవడం, నడక మార్గాలు దెబ్బతినడం వంటి సమస్యలు పెరిగాయి.
నిర్వహణలో తీవ్ర జాప్యం కారణంగా కొందరు ఈ పరిస్థితులపై ఫోటోలు తీసి గత నెల 13న డెన్మార్క్ సంస్థకు ఫిర్యాదు చేశారు.
Details
ప్రైవేట్ నిర్వహణ కారణంగానే సమస్యలు
వైసీపీ ప్రభుత్వ హయాంలో రుషికొండ బీచ్ నిర్వహణ వివాదాస్పదమైంది. 2018లో టీడీపీ ప్రభుత్వం రూ.7 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో బీచ్‌లో మౌలిక వసతులు అందించింది.
అప్పట్లోనే పనులను చేపట్టిన సంస్థ కొద్ది రోజులు నిర్వహణ బాధ్యతలు నిర్వహించింది. అనంతరం ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఈ బీచ్ నిర్వహణను చేపట్టింది.
అయితే రెండు సంవత్సరాల క్రితం నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ తగిన సిబ్బందిని నియమించకపోవడంతో నిర్వహణ ప్రమాణాలు తీవ్రంగా క్షీణించాయి.
దీనివల్ల బీచ్‌పై తగిన శుభ్రత పాటించబడకుండా, మౌలిక వసతులు నాశనమయ్యాయి. ప్రైవేటు సంస్థ నిర్వహణ గడువు గత ఏడాది నవంబరుతో ముగిసింది.
నిర్వహణలో వచ్చిన అంతరాయమే రుషికొండ బ్లూఫ్లాగ్ గుర్తింపు రద్దుకు కారణమైంది.