
Boycott Turkey: ఉద్రిక్తతల నడుమ ఉధృతమైన 'బాయ్‌కాట్ తుర్కియే' నిరసనలు !
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' ఉగ్రవాదులపై ప్రత్యేక చర్యగా పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుంది.
అయితే, ఈ దశలో తుర్కియే పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యవహరించడంతో భారత్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో 'బాయ్‌కాట్ తుర్కియే' నినాదం సామాజిక మాధ్యమాల్లో వేగంగా ప్రచారం అవుతోంది.
తాజాగా, 'బ్యాన్ తుర్కియే' అనే నినాదంతో కొన్ని వాణిజ్య సముదాయాలు తుర్కియే నుండి దిగుమతయ్యే ఉత్పత్తుల అమ్మకాన్ని నిరాకరిస్తున్నాయి.
వివరాలు
పుణెలో బహిష్కరణ నిర్ణయం
పాకిస్థాన్‌తో సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో, దేశవ్యాప్తంగా 'బాయ్‌కాట్ తుర్కియే' ఉద్యమం ముదిరింది.
ఈ క్రమంలో పుణెలోని వ్యాపారులు తుర్కియే నుండి దిగుమతయ్యే యాపిళ్లను (Turkey Apple) ఇకపై విక్రయించబోమని నిర్ణయం తీసుకున్నారు.
దీనివల్ల అక్కడి మార్కెట్లలో తుర్కియే యాపిళ్లు కనపడకుండా పోయాయి. స్థానిక వినియోగదారులు ఇతర ప్రాంతాల నుండి దిగుమతి అయ్యే పండ్లవైపు మొగ్గు చూపుతున్నారు.
వివరాలు
మార్కెట్‌పై ప్రభావం
తుర్కియే యాపిళ్లు పుణే మార్కెట్‌లో ప్రతి సీజన్‌లో సుమారు రూ.1000 నుంచి రూ.1200 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేస్తాయని అంచనా.
వ్యాపారుల తాజా నిర్ణయం పండ్ల మార్కెట్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు.
అయితే వ్యాపారులు మాత్రం ఇది కేవలం ఆర్థిక నిర్ణయం కాదని, దేశ భద్రతా దళాలకు, ప్రభుత్వానికి సంఘీభావంగా తీసుకున్న చర్య అని పేర్కొంటున్నారు.
తుర్కియే యాపిళ్ల బదులుగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఇరాన్ వంటి ప్రాంతాల నుండి యాపిళ్లను దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు.
వివరాలు
రాజకీయ నాయకుల నుండి స్పందనలు
ఇక, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ నేత కుల్‌దీప్ సింగ్ రాథోడ్ కూడా తుర్కియే వ్యవహారశైలిపై తీవ్రంగా స్పందించారు.
2023లో తుర్కియేలో సంభవించిన ఘోర భూకంప సమయంలో భారత ప్రభుత్వం 'ఆపరేషన్ దోస్త్' ద్వారా తగిన సహాయాన్ని అందించినా, ప్రస్తుతం తుర్కియే భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
ఈ పరిస్థితుల్లో తుర్కియే నుండి దిగుమతులను నిషేధించాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు.
వివరాలు
తుర్కియే వైఖరిపై ఆగ్రహం
ఆపరేషన్ సిందూర్ సమయంలో తుర్కియే, పాకిస్థాన్‌కు సైనిక విమానాలు, యుద్ధ నౌకలు పంపినట్లు వార్తలు వెలుగుచూశాయి.
పాకిస్థాన్ ఇప్పుడు అదే ఆయుధాలను భారత్‌పై ప్రయోగిస్తున్నట్లు సమాచారం.
పహల్గాం దాడి అనంతరం ముస్లిం దేశాల్లో తుర్కియే, అజర్‌బైజాన్ మాత్రమే పాక్‌కు మద్దతుగా ప్రకటనలు జారీ చేయడం గమనార్హం.
అంతేకాక, కశ్మీర్ అంశంపై గతంలో పలు అంతర్జాతీయ వేదికలపై తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ భారత్‌ను బహిరంగంగా విమర్శించడం తెలిసిందే.