Page Loader
High Court: ఎల్పీజీ బదిలీ విధానానికి బ్రేక్.. ఆయిల్‌ కంపెనీల నిర్ణయంపై హైకోర్టు తాత్కాలిక స్టే
ఎల్పీజీ బదిలీ విధానానికి బ్రేక్.. ఆయిల్‌ కంపెనీల నిర్ణయంపై హైకోర్టు తాత్కాలిక స్టే

High Court: ఎల్పీజీ బదిలీ విధానానికి బ్రేక్.. ఆయిల్‌ కంపెనీల నిర్ణయంపై హైకోర్టు తాత్కాలిక స్టే

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 06, 2025
09:58 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆయిల్‌ కంపెనీలు ప్రవేశపెట్టిన గ్యాస్‌ వినియోగదారుల బదిలీ, మార్కెట్‌ పునర్నిర్మాణ విధానంపై హైకోర్టు తాత్కాలికంగా మూడు వారాల స్టే ఉత్తర్వులు జారీ చేసింది. వినియోగదారుల బదిలీకి సంబంధించిన విధానం అనుసరించి ప్రాంతాల వారీగా నిర్వహణ జరపాలన్న ప్రతిపాదనపై కొన్ని గ్యాస్‌ ఏజెన్సీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ అంశంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలకు హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది. ఫిబ్రవరి 21న ఆయిల్‌ కంపెనీలు తీసుకువచ్చిన ఈ కొత్త విధానాన్ని వ్యతిరేకిస్తూ శ్రీనివాస ఎంటర్‌ప్రైజెస్‌తో పాటు 33 గ్యాస్‌ ఏజెన్సీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.

Details

ఏజెన్సీలకు నష్టం జరిగే అవకాశం

జస్టిస్ ఎన్‌.వి. శ్రవణ్‌కుమార్‌ ఈ కేసును విచారించి తాత్కాలిక స్టే ఉత్తర్వులు ఇచ్చారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎ.సుదర్శన్‌రెడ్డి వాదిస్తూ, ఏళ్ల తరబడి గ్యాస్‌ ఏజెన్సీలు రీఫిల్‌ సిలిండర్లను విక్రయిస్తూ, భారీగా పెట్టుబడులు పెట్టి, సిబ్బంది నియమించి వినియోగదారులకు సేవలందిస్తున్నారు. ఈ దశలో కొత్త విధానం తీసుకురావడం వల్ల ఏజెన్సీలకు నష్టం జరుగుతుంది. 2018లో కూడా ఇలాంటి మార్కెట్ పునర్నిర్మాణ విధానాన్ని ఆయిల్‌ కంపెనీలు ప్రవేశపెట్టగా, అప్పట్లోనూ హైకోర్టులు దాన్ని ఏకపక్షమై, అసమంజసమై ఉంచినట్లు తీర్పు ఇచ్చాయి.

Details

  మధ్యంతర ఉత్తర్వులు రాలేదు

ఆయిల్‌ కంపెనీలు అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు రాలేదు. ఇప్పుడు మళ్లీ అదే విధానాన్ని తిరిగి తీసుకువచ్చారని వివరించారు. గ్యాస్‌ కంపెనీల తరఫున సీనియర్ న్యాయవాది బి.మయూర్‌రెడ్డి వాదిస్తూ, పిటిషన్లను వేసే అర్హత ఈ ఏజెన్సీలకు లేదని చెప్పారు. కంపెనీలు ప్రవేశపెట్టిన కొత్త విధానం ద్వారా కొత్త పంపిణీదారులకు లాభదాయకంగా ఉంటుందని, ఏజెన్సీలకు ఆయిల్‌ కంపెనీలతో నేరుగా ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇరుపక్షాల వాదనలను పరిశీలించిన హైకోర్టు, తాత్కాలికంగా మూడు వారాలపాటు కొత్త విధానాన్ని నిలిపివేస్తూ స్టే ఉత్తర్వులు జారీ చేసింది.