
Kerala High Court: కోర్టు తీర్పుల్లో చాట్‌జిపిటి వాడకానికి బ్రేక్.. కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు!
ఈ వార్తాకథనం ఏంటి
కోర్టు తీర్పులు, ఉత్తర్వులు ఇవ్వడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ వినియోగాన్ని నిరోధిస్తూ కేరళ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని కోర్టులకు, న్యాయ అధికారులకు హైకోర్టు ప్రత్యేక మార్గదర్శకాలు ఇచ్చింది. చాట్‌జిపిటి వంటి క్లౌడ్ ఆధారిత ఏఐ టూల్స్‌ను తీర్పులు లేదా ఆదేశాల రూపకల్పనలో ఉపయోగించరాదని స్పష్టం చేసింది. హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను లంకించితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. తీర్పుల రూపకల్పనలో ఏఐ వినియోగంపై కోర్టు స్పష్టమైన ఆంక్షలు విధించగా, AI సాధనాలు అభిప్రాయాలను ఏర్పరచేందుకు, తీర్మానాలకు కారణాలను అందించేందుకు ఉపయోగపడతాయన్న భావనను తిరస్కరించింది. కోర్టు తీర్పుల విషయంలో పూర్తి బాధ్యత న్యాయమూర్తులదేనని హైకోర్టు స్పష్టం చేసింది.
Details
శిక్షణ అవసరమని హైకోర్టు
అంతేగాక, AI టూల్స్ వినియోగానికి ముందు తగిన శిక్షణ అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. AI వాడకంలో లోపాలు తలెత్తే అవకాశం ఉండటంతో, జ్యుడిషియల్ అకాడమీ లేదా హైకోర్టు నిర్వహించే శిక్షణా కార్యక్రమాల్లో న్యాయమూర్తులు, లాయర్లు, న్యాయాధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని సూచించింది. త్వరలోనే అధికారికంగా అనుమతి పొందిన ఏఐ సాధనాలను ప్రయోగించే అవకాశం ఉందని పేర్కొంది. తదుపరి దశల్లో, ఏఐ టూల్స్ వినియోగంలో తప్పిదాలు తలెత్తితే వెంటనే వాటిని గుర్తించి హైకోర్టు ఐటీ విభాగానికి తెలియజేయాలని స్పష్టం చేసింది. AIఆధారిత వ్యవస్థలపై నిరంతర పర్యవేక్షణ ఉండాల్సిన అవసరాన్ని హైకోర్టు హైలైట్ చేసింది. దేశంలో ఒక హైకోర్టు నేరుగా ఇతర కోర్టులకు,న్యాయమూర్తులకు ఈ రకమైన స్పష్టమైన సూచనలు జారీ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.