Page Loader
F-35B Fighter: కేరళలో చిక్కుకున్న F-35B ఫైటర్ జెట్.. రంగంలోకి బ్రిటన్‌ గ్లోబ్‌మాస్టర్‌..! 
కేరళలో చిక్కుకున్న F-35B ఫైటర్ జెట్.. రంగంలోకి బ్రిటన్‌ గ్లోబ్‌మాస్టర్‌..!

F-35B Fighter: కేరళలో చిక్కుకున్న F-35B ఫైటర్ జెట్.. రంగంలోకి బ్రిటన్‌ గ్లోబ్‌మాస్టర్‌..! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 03, 2025
04:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్రిటన్‌కు చెందిన అత్యాధునిక సామర్థ్యాలతో రూపొందిన ఎఫ్-35బి (F-35B) యుద్ధ విమానం మొరాయించి, ఇప్పటికే దాదాపు 20 రోజులుగా కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం విమానాశ్రయంలో నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ విమానాన్ని మళ్లీ నిర్వహణలోకి తీసుకొచ్చేందుకు యూకే నుండి వచ్చిన నిపుణుల బృందం ప్రయత్నించినా, అనుకున్న ఫలితాన్ని సాధించలేకపోయారు. దాంతో, బ్రిటిష్ నేవీ పరిస్థితిని పరిశీలించి, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విమానాన్ని అక్కడే మరమ్మతు చేయడం సాధ్యం కాకపోవడంతో, దాన్ని విభజించి విడి భాగాలుగా ఎయిర్‌లిఫ్ట్‌ చేయాలన్న ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో, అతిపెద్ద రవాణా సామర్థ్యం కలిగిన సీ-17 గ్లోబ్‌మాస్టర్‌ విమానాన్ని భారత్‌కు పంపే ఏర్పాట్లు బ్రిటన్ చేపట్టినట్లు విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి.

వివరాలు 

తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్‌

ఇంత కాలం విమానాశ్రయంలో ఫైటర్‌ జెట్‌ను నిలిపి ఉంచినందుకు గాను,హ్యాంగర్‌ వాడకం,పార్కింగ్‌ ఫీజులు వంటి వివిధ ఖర్చులకు సంబంధించి బకాయిలను భారత్‌కు చెల్లించనున్నట్లు బ్రిటిష్ నేవీ పేర్కొన్నట్టు తెలుస్తోంది. అయితే,ఈ మొత్తాన్ని ఖచ్చితంగా ఎంతగా నిర్ణయించాలో భారత ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంది. గత నెలలో నిర్వహించిన ఇండియా-యూకే నౌకాదళ సంయుక్త విన్యాసాల్లో పాల్గొన్న సమయంలో ఈ ఎఫ్-35బి విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఫలితంగా,జూన్ 14 అర్ధరాత్రి తరువాత తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. మొదట ఈ ల్యాండింగ్‌ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, అలాగే ఇంధన లోపం వల్ల జరిగిందన్న వార్తలు వచ్చాయి. అయితే, అనంతరం బ్రిటన్ సైనికాధికారులు దీనికి ఇంజినీరింగ్ సమస్యలే ప్రధాన కారణమని స్పష్టం చేశారు.

వివరాలు 

ఎఫ్‌-35 అనేది 5వ తరం స్టెల్త్‌ ఫైటర్‌జెట్‌.

ఈ సమస్య పరిష్కారానికి సంబంధించి అదే రాత్రి ఏడబ్ల్యూ101 మెర్లిన్ హెలికాప్టర్‌ ద్వారా నిపుణులు తిరువనంతపురానికి చేరుకున్నారు. వారు మరమ్మతులు చేపట్టినప్పటికీ విమానం మళ్లీ పనికి రాలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 20 రోజులుగా ఈ యుద్ధ విమానం విమానాశ్రయంలోనే నిలిచిపోయి ఉంది. ఈ క్రమంలో,బ్రిటన్ నుండి సుమారు 40 మంది ప్రత్యేక నిపుణుల బృందాన్ని పంపించారు. ఎఫ్-35బి అనేది ఐదవ తరం స్టెల్త్‌ టెక్నాలజీతో రూపొందించిన ఫైటర్‌ జెట్‌. దీనికి తక్కువ దూరంలో టేకాఫ్‌ అవడం, నిలువుగా ల్యాండ్‌ అయ్యే సామర్థ్యం వంటి అధునాతన సాంకేతికత ఉంది. ఈ రకం యుద్ధ విమానాలు ప్రస్తుతం అమెరికా వంటి చాలా తక్కువ దేశాల సైన్యాల వద్ద మాత్రమే ఉన్నాయి.