Sakshi Mallik: "దేశపు ఆడపడుచులు ఓడిపోయారు".. బ్రిజ్ భూషణ్ కొడుక్కి టిక్కెట్ దక్కడంపై రెజ్లర్లు
ఉత్తర్‌ప్రదేశ్ లోని కైసర్‌గంజ్ నుంచి మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ స్థానంలో ఆయన కుమారుడు కరణ్‌సింగ్‌కు బీజేపీ టికెట్ ఇచ్చింది. గతేడాది బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ మహిళా రెజ్లర్లు ఢిల్లీలో నెల రోజుల పాటు ప్రదర్శనలు చేశారు. దీని తర్వాత అతను రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) అధ్యక్ష పదవి నుండి తొలగించబడ్డాడు. ఇప్పుడు బీజేపీ తన కుమారుడిని ఎన్నికల్లో నిలబెట్టడంతో మహిళా రెజ్లర్లు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి నెలలోనే, బ్రిజ్ భూషణ్ చిన్న కుమారుడు కరణ్ సింగ్ కూడా ఉత్తరప్రదేశ్ రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
స్పందించిన సాక్షి మాలిక్
ఈ సందర్భంగా రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సాక్షి మాలిక్ ఎక్స్‌లో స్పందించారు. "బ్రిజ్ భూషణ్ గెలిచి, భారత కుమార్తెలు ఓడిపోయారు. మేమంతా కెరీర్‌ని పణంగా పెట్టి చాలా రోజులు రోడ్డున పడ్డాం. అయినప్పటికీ బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేయలేదు. న్యాయం చేయాలని డిమాండ్ చేశాం. ఇప్పుడు అరెస్ట్‌ను మర్చిపోయి బీజేపీ ఆయన కుమారుడికి టికెట్ ఇచ్చింది. దేశంలోని కోట్లాది మంది కూతుళ్ల గుండెలు పగిలిపోయాయి. టికెట్ ఇప్పటికీ ఆయన కుటుంబంలోనే ఉంది.ఒక వ్యక్తి ముందు ప్రభుత్వం ఎందుకు బలహీనంగా ఉంది? మీ అందరికీ రాముడి పేరు మీద ఓట్లు కావాలి కానీ ఆయన ఆశయాలను ఎందుకు పాటించడం లేదు. అంటూ ట్వీట్ చేశారు.
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై 1000పేజీల ఛార్జ్ షీట్
బ్రిజ్ భూషణ్‌కు సన్నిహితుడైన సంజయ్ సింగ్ డబ్ల్యుఎఫ్‌ఐ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత సాక్షి మాలిక్ గత సంవత్సరం ఆడటం మానేసిన విషయం తెలిసిందే. మాలిక్ తల్లి మాట్లాడుతూ, తాము చాలా నిరాశ చెందామని.. కరణ్‌సింగ్‌కి టిక్కెట్ రావడంతో మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదన్న విషయం అర్థమయ్యిందన్నారు. తన కూతురు ఆడడం మానేసిందని.. బజరంగ్, వినేష్ తమ అవార్డులను వాపస్ చెయ్యడం వృధా అయ్యిందన్నారు. జూన్ 2023లో,ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై 1000పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అతనిపై ఐపీసీ 354,354డి,345ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. ఈ కేసు తదుపరి విచారణ మే 7న జరగనుంది.
ప్రజ్వల రేవణ్ణ ప్రస్తావన
ఇది మాకు వెన్నుపోటు లాంటిందని రెజ్లర్ జితేంద్ర సింగ్ అన్నాడు. ఇందుకోసమేనా మేము వీధుల్లో పడుకున్నాం ? బ్రిజ్ భూషణ్ కి సంబందించిన వాళ్ళు డబ్ల్యుఎఫ్‌ఐలో కూర్చుంటే..ఇప్పుడు ఆయన కుమారుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం, అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దేశ దురదృష్టమని టోక్యో ఒలింపిక్స్ పతక విజేత బజరంగ్ పునియా పేర్కొన్నాడు. బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా చెప్పుకుంటోందని, అయితే లక్షలాది మంది కార్యకర్తల్లో ఒక్కరికే టికెట్ ఇచ్చారని అన్నారు. ఈ క్రమంలో ప్రజ్వల రేవణ్ణ ప్రస్తావన కూడా తెచ్చారు. దేశంలోని ఆడబిడ్డలను రోడ్డున పడేసి, లైంగిక వేధింపుల నిందితుడి కుమారుడికి ఎన్నికల టిక్కెట్టు ఇవ్వడం దేశ దౌర్భాగ్యం అని అన్నారు.