
Padamarao: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌కు గుండెపోటు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గుండెపోటు కారణంగా ఆసుపత్రిలో చేరారు.
డెహ్రాడూన్‌లో పర్యటనలో ఉన్న సమయంలో ఆయనకు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది.
కుటుంబ సభ్యులు ఆయనను తక్షణమే స్థానిక ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు అత్యవసర పరీక్షలు నిర్వహించి స్టంట్ అమర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.
పద్మారావు గౌడ్ గుండెపోటుకు గురయ్యారనే సమాచారం బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది.
70 ఏళ్ల వయసు కలిగిన పద్మారావు గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్‌కు ముఖ్య నాయకులుగా పేరుపొందారు.
వివరాలు
పద్మారావు గౌడ్ రాజకీయ ప్రస్థానం
పద్మారావు గౌడ్ రాజకీయ జీవితం మున్సిపల్ కౌన్సిలర్ స్థాయి నుంచి ప్రారంభమైంది.
హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కౌన్సిలర్‌గా పనిచేసి,అంచెలంచెలుగా ఎదిగారు.
2001లో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్)లో చేరారు. 2004లో తొలిసారి సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
2009 ఎన్నికల్లో సనత్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా, కాంగ్రెస్ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు.
అయితే, 2014 నుంచి సికింద్రాబాద్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తూ బలమైన స్థానాన్ని కలిగి ఉన్నారు.
2014 నుంచి 2018 వరకు ఎక్సైజ్, స్పోర్ట్స్ శాఖ మంత్రిగా పనిచేశారు.
2019 ఫిబ్రవరి 24న తెలంగాణ రెండో అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనుభవజ్ఞుడైన రాజకీయ నేతగా,ప్రజాసేవలో కొనసాగుతూ గుర్తింపు పొందారు.