Page Loader
Kavitha: సొంత పార్టీ నాయకులే నన్ను ఓడించారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత  
సొంత పార్టీ నాయకులే నన్ను ఓడించారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత

Kavitha: సొంత పార్టీ నాయకులే నన్ను ఓడించారు.. సంచలన వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత  

వ్రాసిన వారు Sirish Praharaju
May 29, 2025
12:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత రాష్ట్ర సమితి (భారాస) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్‌)కు తాను వ్యక్తిగతంగా ఇచ్చిన అభిప్రాయాలు ఎలా బయటపడ్డాయో తెలియడం లేదని ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. తాను సమర్పించిన ఫీడ్‌బ్యాక్‌ను బయటకు లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరితే, తనపై పెయిడ్ సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారాన్ని ప్రారంభించారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మీడియా సమావేశంలో ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనం సృష్టించాయి.

వివరాలు 

లిక్కర్ కేసు సమయంలో రాజీనామా చేయాలని అనుకున్న..

కవిత తీవ్రంగా స్పందిస్తూ, "కేసీఆర్‌కు నోటీసులు వస్తే పార్టీలో ఉన్న నేతలు మౌనంగా ఉండిపోతే ఏం చేయాలి? ఒకవైపు నన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తూ, ఇంకొవైపు నీతులు చెప్పే కోవర్టులు ఉంటే ఎలా? నాపై దాడులు చేస్తూ నా పై ఏడవడం న్యాయం కాదుగా! ఇంటి ఆడపిల్ల గురించి ఎవరైనా ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మర్యాదనా?" అంటూ ప్రశ్నించారు. లిక్కర్ కేసు సమయంలో తాను రాజీనామా చేయాలని అనుకున్నానని, అయితే కేసీఆర్‌ అంగీకరించలేదని ఆమె తెలిపారు. అదే సమయంలో తన పార్టీ సభ్యులే కుట్ర చేసి తాను ఎంపీగా ఓడిపోవడానికి కారణమయ్యారని తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే అదే జిల్లాలో కేసీఆర్‌ తనను ఎమ్మెల్సీగా చేశారని గుర్తు చేశారు.

వివరాలు 

భారాసను భాజపాలో కలిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? 

"లీకులు చేసిన వారిని పట్టుకోమంటే నాపై ప్రతాపం చూపించడం ఏమిటి? కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలపై పోరాడాలి కానీ నాపై తప్పుడు ప్రచారం చేయడం సరైంది కాదు" అని ఆమె మండిపడ్డారు. భారత రాష్ట్ర సమితిని బీజేపీలో విలీనం చేయాలన్న యత్నాలు జరుగుతున్నట్టు తన దృష్టికి వచ్చాయని, అయితే తాను జైలులో ఉండగానే ఆ ప్రతిపాదన వచ్చినప్పుడే తాను దానికి వ్యతిరేకంగా తన అభిప్రాయాన్ని తెలిపినట్టు పేర్కొన్నారు. తాను ఎప్పటికీ భారాసను బీజేపీలో కలిపే యత్నాలను అంగీకరించనని స్పష్టం చేశారు.

వివరాలు 

నన్ను పార్టీ నుంచి ఎవరు బయటకు పంపుతారు?

"పార్టీ స్వతంత్రంగా కొనసాగాలని నా అభిప్రాయం.నాపై తప్పుడు ప్రచారం జరిగిందన్నా పార్టీ అధికారికంగా స్పందించలేదు. నన్ను పార్టీ నుంచి ఎవరు బయటకు పంపుతారు? కాంగ్రెస్‌తో సంప్రదింపులున్నాయని వస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యం.ఈ పార్టీలో నా నాయకుడు ఒక్కరే - కేసీఆర్‌. ఆయన నేతృత్వంలోనే నేను పనిచేస్తాను. వెన్నుపోటు పొడిచే మనస్తత్వం నాకు లేదు,నేను నేరుగా పోరాడే వ్యక్తిని" అని కవిత స్పష్టం చేశారు. దేశం వెలుపల ఐటీ సెల్‌లు పెట్టి దాడులు చేయడాన్ని కవిత ఖండించారు.

వివరాలు 

ఈ పార్టీ నాది అన్న భావన ప్రతి ఒక్కరికి ఉండాలి

"నిజమైన దోపిడీదారులను పట్టించకుండా నన్నే లక్ష్యంగా చేయడం ఎంతవరకు న్యాయం? ఈ పార్టీ నాది అన్న భావన ప్రతి ఒక్కరికి ఉండాలి. అప్పుడే ఉద్యమానికి తగిన ఫలితాలు వస్తాయి. కేసీఆర్‌కు నోటీసులు వస్తే ఎక్స్‌లో ఓ పోస్టు పెడితే సరిపోతుందా?" అని ఆమె నిలదీశారు. తాను ఎప్పుడూ పదవుల కోసం పోరాడలేదని స్పష్టం చేసిన కవిత, "తెలంగాణ ఉద్యమ సమయంలో నేను గర్భంతో ఉన్నప్పటికీ ఉద్యమంలో భాగంగా పనిచేశాను. నన్ను విమర్శిస్తున్న వాళ్లు కేసీఆర్‌ నీడన ఉన్నారన్నారు. వారు స్వయంగా ఏ కార్యక్రమాలు చేశారు?" అంటూ ఘాటుగా విమర్శించారు.