
#NewsBytesExplainer: కాంగ్రెస్ వైఫల్యాలే టార్గెట్‌గా.. స్థానిక ఎన్నికల సమరానికి సిద్ధం అవుతున్న బీఆర్ఎస్..
ఈ వార్తాకథనం ఏంటి
అధికారాన్ని కోల్పోయిన తర్వాత తొలిసారిగా బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఆ పార్టీలో చర్చకు కేంద్రబిందువుగా మారాయి. పార్టీ అధిష్ఠానం,పేరుకు జిల్లా అధ్యక్షులు తప్ప నిర్మాణం లేని ఈ స్థితిలో క్యాడర్‌ను ఎన్నికల వైపు ఎలా నడిపిస్తారనే అనే ప్రశ్నలు ఓవైపు, మరోవైపు పాత నాయకుల ఆధిపత్యం కొనసాగుతున్న నియోజకవర్గాల్లో ఉన్న అసమ్మతి వర్గాలను ఎలా సమన్వయం చేస్తారు అనే విషయాలపై పార్టీ నేతల మద్య తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుత,మాజీ ఎమ్మెల్యేలలో చాలామందికి అసంతృప్తి ఉన్నప్పటికీ, ఆర్థిక బలంలో మాత్రం కొద్దిమంది తప్ప మిగిలినవారు ముందున్నారని భావిస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత,ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో జాప్యం వంటి అంశాలను బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మలచుకోవాలని ఆశలు పెట్టుకుంది.
వివరాలు
పార్టీ గుర్తింపు దక్కని నాయకులు
గ్రూపుల మధ్య ఐక్యత సాధిస్తే గానీ విజయం సాధ్యపడదని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్‌లో కేసీఆర్ కుటుంబానికి చెందిన 4-5మంది మినహా మిగతావారికి పార్టీలో ప్రత్యేకమైన గుర్తింపు లేదని గమనించవచ్చు. జిల్లా అధ్యక్ష హోదా ఉన్నప్పటికీ, పార్టీ కార్యకలాపాలలో కీలక పాత్ర పోషించనివారు అనేక మంది. శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ కొనసాగుతున్నప్పటికీ, మిగతా ఉప పదవుల నియామకం జరగకపోవడం కూడా కార్యకర్తల్లో అసంతృప్తికి దారి తీస్తోంది. గత ఏప్రిల్ 27న ఎల్కతుర్తిలో జరిగిన పార్టీ 25వ ఆవిర్భావ సభలో కూడా కేసీఆర్ మాత్రమే ప్రసంగించగా,వేదికపై బ్యాక్‌డ్రాప్‌లో కేవలం కేసీఆర్,కేటీఆర్ ఫోటోలే కనిపించాయి. సభముగిసిన తర్వాత కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించినా,ఆ దిశగా ఎలాంటి చర్యలు కనిపించకపోవడంతో క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు
కేడర్ ఎంతున్నా నిర్మాణం మాత్రం సున్నా
బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న నేటి దుస్థితి..చేజేతులా కొనితెచ్చుకున్నదేననే అభిప్రాయం మధ్య స్థాయి నేతల్లో కూడా కనిపిస్తోంది. కొద్దిమంది నాయకులను తప్ప మరెవ్వరినీ గుర్తించకపోవడం వల్ల ఇతర పార్టీలు కూడా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాయని ఒక నేత వాపోయారు. బీఆర్ఎస్‌కు సమృద్ధిగా కేడర్ ఉన్నా,స్థానికంగా పార్టీ నిర్మాణం లేకపోవడం వల్ల ఎన్నికల కోసం సిద్ధమవ్వడమే జిల్లా అధ్యక్షులకు పెద్ద సవాలుగా మారింది. నియోజకవర్గ,మండల,గ్రామ స్థాయి సమావేశాల నిర్వహణలోనే అవస్థలు ఎదురయ్యే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈపరిస్థితుల్లో"ఒకచోట ఒకేసారి అన్నీ పూర్తి చేయాలి"అనే గంపగుత్త విధానంతో సమావేశాలు జరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కేటీఆర్ స్వయంగా పార్టీ శ్రేణులకు,నాయకులకు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చిన సందర్భంలో కూడా ఈ సమస్యను గుర్తించారనే అభిప్రాయం ఉంది.
వివరాలు
మాజీ ఎమ్మెల్యేలదే ఆధిపత్యం
నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశాల నిర్వహణ బాధ్యతను జిల్లా అధ్యక్షులు తీసుకోవాలని సూచించారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో జిల్లా అధ్యక్షులకు పిలుపునిచ్చినా, నియంత్రణ మాత్రం గత, ప్రస్తుత ఎమ్మెల్యేల ఆధిపత్యమనేది బహిరంగ అంశం. అధికారంలో ఉన్న సమయంలోనే పార్టీ 33 జిల్లాలకు జిల్లా అధ్యక్షులను నియమించినా, వారు కేవలం కార్యక్రమాలకు హాజరయ్యే పాత్రకే పరిమితమయ్యారు. అప్పట్లోనే ఎమ్మెల్యేలు వారిని పట్టించుకోలేదు. తాజా పరిస్థితుల్లో వారెంత ప్రాధాన్యతను పొందగలుగుతారు? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో మాజీ ఎమ్మెల్యేలు స్వయంగా నియోజకవర్గ సమావేశాలు నిర్వహిస్తున్నా, జిల్లా అధ్యక్షులు కనిపించకపోవడం వారికున్న స్థానాన్ని వివరిస్తుంది.
వివరాలు
నేటికీ అసమ్మతి కుంపట్లు
రాష్ట్రవ్యాప్తంగా కొన్నిచోట్ల మినహా,ఎక్కువ నియోజకవర్గాల్లో గత పదేళ్లుగా ఒకే వ్యక్తి ఎమ్మెల్యేగా కొనసాగుతూ,తనే నియంతగా వ్యవహరించాడు. దీంతో గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మెజార్టీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల తీరుపై తిరుగుబాట్లు వచ్చాయి. జనగామ,స్టేషన్ ఘన్‌పూర్,మానుకోట,వర్ధన్నపేట,నర్సంపేట,పరకాల,పాలకుర్తి వంటి స్థానాల్లో స్పష్టమైన వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే, చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోవడం వల్ల ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు పార్టీ నిర్మాణంలో మార్పులు లేకుండా,అదే నేతలు నియోజకవర్గ ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తున్నారు. పార్టీకి సంబంధించి ఏ నిర్ణయాలైనా వారే తీసుకుంటున్నారు. పాత అసమ్మతులు,విభేదాలు అలాగే కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితిలో పార్టీ అంతర్గతంగా ప్రక్షాళన చేయకుండా స్థానిక ఎన్నికలు ఎదుర్కోవడమంటే బయటి నుంచి ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా ఇంటిపోరు కూడా తప్పకపోవచ్చంటున్నారు విశ్లేషకులు.
వివరాలు
కాంగ్రెస్ పాలనా వైఫల్యాలే బీఆరెస్‌కు దిక్కు
ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ పార్టీ పాలన వైఫల్యాలను ప్రధాన అంశంగా తీసుకొని ఎన్నికల్లో పోటీ చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హామీలలో వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునివ్వడం గమనార్హం.