LOADING...
AP Assembly: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. 10 గంటలకు గవర్నర్‌ ప్రసంగం
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. 10 గంటలకు గవర్నర్‌ ప్రసంగం

AP Assembly: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. 10 గంటలకు గవర్నర్‌ ప్రసంగం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 24, 2025
08:13 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇవే తొలి పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు.ఈ సమావేశాల ఏర్పాట్లు,భద్రతా చర్యలపై ఆదివారం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఉన్నతాధికారులతో సమీక్షించారు. భద్రతా కారణాల దృష్ట్యా అసెంబ్లీ ఆవరణలోకి సభ్యుల వ్యక్తిగత సహాయకులు (పీఏలు), ఇతర వ్యక్తిగత సిబ్బంది, సందర్శకులను అనుమతించకూడదని నిర్ణయించారు. పాస్‌ల జారీని కూడా ఈసారి నియంత్రించినట్లు స్పీకర్ అధికారులకు స్పష్టం చేశారు. సభ్యులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల నుంచి పెండింగ్‌లో ఉన్న సమాధానాలను నిర్దేశిత సమయంలో అందించాలని సీఎస్‌ను ఆదేశించారు.

వివరాలు 

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అధికారులకు సూచనలు 

సభ సమావేశాల నిర్వహణకు సంబంధించి స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులకు అవసరమైన సూచనలు అందించారు. సమావేశం అనంతరం, అసెంబ్లీ సచివాలయం కోసం నిర్మిస్తున్న అదనపు భవన సముదాయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మీడియా పాయింట్, క్యాంటీన్‌లను పరిశీలించారు. ఏర్పాట్లలో కొన్ని మార్పులను సూచించారు. ఈ సమావేశంలో ఆర్థిక, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా, అసెంబ్లీ కార్యదర్శి జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

వివరాలు 

గవర్నర్ పర్యటన వివరాలు 

గవర్నర్ ఉదయం 9.53 గంటలకు అసెంబ్లీ ఆవరణలో ప్రవేశిస్తారు. గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సభలో ప్రవేశించి, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆయన 11.15 గంటలకు తిరిగి వెళతారు. నిషేధాజ్ఞల అమలు అసెంబ్లీ బులెటిన్ ప్రకారం, సమావేశాల సమయంలో కొన్ని నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి: సభ్యులు తమ వ్యక్తిగత సహాయకులు (పీఏలు), ఇతర వ్యక్తిగత సిబ్బంది, సందర్శకులను అసెంబ్లీ ఆవరణలోకి తీసుకురావద్దు. సభ్యులు సభాప్రాంగణంలో నినాదాలు చేయకూడదు. ప్లకార్డులు ప్రదర్శించరాదు, కరపత్రాలు పంపిణీ చేయకూడదు. అసెంబ్లీ ఆవరణలో ఊరేగింపులు, ప్రదర్శనలు, బైఠాయింపులకు అనుమతి లేదు.