కర్ణాటకలో కేబినెట్ విస్తరణ; రేపు 24మంది మంత్రులు ప్రమాణ స్వీకారం
కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం శనివారం కేబినెట్‌ను విస్తరించనుంది. సిద్ధరామయ్య ప్రభుత్వంలో మరో 24 మంది మంత్రులు శనివారం ప్రమాణస్వీకారం చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. దిల్లీలోని కాంగ్రెస్ కేంద్ర నేతలతో జరిగిన సమావేశంలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మంత్రుల పేర్లను ఖరారు చేసినట్లు కర్ణాటక పార్టీ వర్గాలు వెల్లడించాయి. జాబితాను ఫైనల్ చేసేందుకు శుక్రవారం సిద్ధరామయ్య, సీఎం డీకే శివకుమార్ రాహుల్ గాంధీని కలవనున్నారు. మే 20న సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.
పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని విస్తరించాకే పోర్ట్‌ఫోలియోల కేటాయింపు
సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌తో పాటే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వారితో పాటు మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేశారు. అయితే, ఇప్పటి వరకు పోర్ట్‌ఫోలియోల కేటాయింపు జరగలేదు. కేబినెట్‌ను పూర్తిస్థాయిలో విస్తరించి, అన్ని వర్గాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు పోర్ట్‌ఫోలియోలు కేటాయించలేదని తెలుస్తోంది. అయితే ఈ పోర్ట్‌ఫోలియోల ద్వారా అన్ని వర్గాలను సంతృప్తిపర్చడం కాంగ్రెస్‌కు కత్తిమీద సామే అని చెప్పాలి. రాష్ట్రంలో రాజకీయంగా అత్యంత కీలకమైన వర్గమైన లింగాయత్ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు ఎక్కువ సంఖ్యలో మంత్రి పదవులు దక్కుతాయని ఆశిస్తున్నారు.