Supreme Court: పాకిస్తానీ అని పిలవడం మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం కాదు: సుప్రీంకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
సుప్రీంకోర్టు (Supreme Court) వెల్లడించిన మేరకు, ఎవరికైనా "పాకిస్తానీ" అని పిలవడం మత విశ్వాసాలను కించపరిచినట్లు భావించరాదు.
"మియాన్-తియాన్" లేదా "పాకిస్తానీ" అని సంబోధించడం హేళనకరమే అయినా, అందులో మత విశ్వాసాలను దెబ్బతీయాలని ఉద్దేశం లేదని పేర్కొంది.
ఈ అభిప్రాయాన్ని జస్టిస్ బీవీ నాగరత్న, సతీష్ చంద్ర శర్మ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది.
ఒక ప్రభుత్వ ఉద్యోగిని "పాకిస్తానీ" అని పిలవడంపై ఆయన కేసు దాఖలు చేయగా, ఈ రోజు విచారణ జరిపిన సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
జార్ఖండ్‌కు చెందిన ఓ ఉర్దూ అనువాదకుడు ఈ ఫిర్యాదు నమోదు చేశాడు.
సమాచారం హక్కు చట్టం (RTI) కింద దరఖాస్తు చేసుకున్న నిందితుడు,సమాచారాన్ని పొందేందుకు వెళ్లిన సమయంలో, ప్రభుత్వ ఉద్యోగితో వాగ్వాదానికి దిగాడు.
వివరాలు
జార్ఖండ్ హైకోర్టు తీర్పును రద్దు చేసిన సుప్రీంకోర్టు
ఆ ఉద్యోగి మతాన్ని దూషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, విధులను అడ్డుకున్నట్లు కూడా అభియోగాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, అతనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఈ కేసులో,భారతీయ శిక్షాస్మృతి (IPC) లోని 298 (మతపరమైన విశ్వాసాలను కించపరచడం),504 (అవమానకర ప్రవర్తన),353 (ప్రభుత్వ ఉద్యోగిపై దాడి)సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు.
అయితే,జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది."పాకిస్తానీ" అని పిలవడం అమర్యాదకరమైనదే అయినా,మత విశ్వాసాలను దెబ్బతీసినట్లు కానందున,శిక్షార్హం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
అంతేగాక,నిందితుడు శాంతి భంగం కలిగించేలా ప్రవర్తించలేదని పేర్కొంది. IPC 353 సెక్షన్ కింద నిందితుడిని శిక్షించేందుకు ఆధారాలు లేవని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.