
Droupadi Murmu: రాష్ట్రాలు పంపించే బిల్లుల విషయంలో రాష్ట్రపతి,గవర్నర్‌కు సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టొచ్చా.. ద్రౌపదీ ముర్ము ప్రశ్న
ఈ వార్తాకథనం ఏంటి
శాసనసభలు ఒకసారి కాదు, రెండుసార్లు ఆమోదించిన బిల్లులపై కూడా గవర్నర్లు తగిన నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేయడం, అలాగే రాష్ట్రపతి పరిశీలనలో ఉన్న బిల్లులు కూడా తీవ్ర జాప్యానికి గురవుతున్న పరిణామాలపై సుప్రీంకోర్టు ఇటీవల చారిత్రాత్మకంగా ఒక కీలక తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే.
ఈ తీర్పులో గవర్నర్ మాత్రమే కాకుండా రాష్ట్రపతికి కూడా సమయ పరిమితిని విధించడం అరుదైన ఘటనగా దేశ రాజకీయ చరిత్రలో నిలిచింది.
తాజాగా ఈ తీర్పుపై భారత దేశ ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించినట్లు సమాచారం.
రాజ్యాంగంలో అలాంటి స్పష్టమైన నిబంధనలు లేకపోయినప్పుడు సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు ఎలా ఇచ్చిందని ఆమె ప్రశ్నించినట్లు పలు ప్రముఖ ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.
వివరాలు
బీఆర్ గవాయ్ ఈ అంశంపై రాజ్యాంగ ధర్మాసనాన్ని త్వరలో ఏర్పాటు చేసే అవకాశం
రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 కింద రాష్ట్రపతికి ఉన్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి ఆమె ఈ ప్రశ్నలను సంధించినట్లు తెలుస్తోంది.
రాష్ట్రపతి అడిగిన ప్రశ్నలకు సంబంధించి సుప్రీంకోర్టు అభిప్రాయాలు తెలియజేయాలని కోరినట్లు సమాచారం.
తాజా పరిణామాల నేపథ్యంలో, భారతదేశ కొత్త ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్ ఈ అంశంపై రాజ్యాంగ ధర్మాసనాన్ని త్వరలో ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు న్యాయవర్గాలు చెబుతున్నాయి.
వివరాలు
రాష్ట్రపతి ముర్ము సంధించిన ప్రశ్నలు ఇవే:
రాజ్యాంగంలోని రాష్ట్రపతి లేదా గవర్నర్ అధికారాలను సుప్రీంకోర్టు తన సొంత అధికారాలతో (ఆర్టికల్ 142) ఎలా భర్తీ చేయగలదు?
రాష్ట్రాలు తమకు అనుకూలంగా సుప్రీంకోర్టుకు ఉన్న ప్లీనరీ అధికారాలను కేంద్రానికి వ్యతిరేకంగా దుర్వినియోగం చేస్తున్నాయా?
రాష్ట్రపతి, గవర్నర్‌లకు గడువును కోర్టులు ఎలా నిర్దేశించగలవు?
ఆర్టికల్ 200 ప్రకారం బిల్లును సమర్పించినప్పుడు గవర్నర్‌కు రాజ్యాంగపరంగా ఎలాంటి ఎంపికలు అందుబాటులో ఉంటాయి?
ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి, అలాగే ఆర్టికల్ 200 కింద గవర్నర్ రాజ్యాంగ విచక్షణాధికారాన్ని వినియోగించడం న్యాయసమ్మతమా?
వివరాలు
సుప్రీంకోర్టు తీర్పు వివరాలు
తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్.రవి సుదీర్ఘ కాలం పాటు తన వద్దే ఉంచుకోవడం రాజ్యాంగ విరుద్ధమని, ఏప్రిల్ 2024లో సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది.
ఈ కేసులో సుప్రీంకోర్టు 415 పేజీల లోపల తీర్పును ఇచ్చింది. బిల్లులు వచ్చిన తర్వాత గవర్నర్ లేదా రాష్ట్రపతి గరిష్ఠంగా మూడు నెలల వ్యవధిలో తగిన నిర్ణయం తీసుకోవాలన్నది ఈ తీర్పు ప్రధానాంశం.
ఆమోదం, తిరస్కారం లేదా తిరిగి శాసనసభకు పంపడం.. ఈ మూడు మార్గాల్లో ఏదో ఒకటి తక్కువ సమయంలోనే చేయాలని తీర్పులో పేర్కొంది.
వివరాలు
సుప్రీంకోర్టు తీర్పు వివరాలు
అంతేకాదు, బిల్లును తిరిగి పంపుతున్న సందర్భంలో గవర్నర్ ఎందుకు తిరస్కరించారో స్పష్టమైన కారణాలు జతచేయాల్సిన బాధ్యత ఉందని కూడా కోర్టు స్పష్టం చేసింది.
ఈ తీర్పు వెలువడిన తరువాత కూడా గవర్నర్లు బిల్లులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, ఆయా రాష్ట్రాలు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది.
గవర్నర్‌ల నిష్క్రియత సైతం న్యాయపరిశీలనలోకి వస్తుందని వెల్లడించింది.
అంతేకాకుండా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టుకు సంపూర్ణ అధికారం ఉందని, సమకాలీన పరిస్థితుల్లో ప్రజాస్వామ్య పరిరక్షణకు కోర్టు చర్యలు తీసుకోవచ్చని జస్టిస్ జె.బి. పార్దీవాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం తేల్చిచెప్పింది.