
Operation Sindoor: పాకిస్తాన్ ఉపయోగించే చైనా వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత దళాలు పాకిస్థాన్, పీవోకే (పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్) ప్రాంతాల్లో 'ఆపరేషన్ సిందూర్' అనే కోడ్ పేరుతో సర్జికల్ దాడులు నిర్వహించాయి.
ఈ ఘట్టంలో సుమారు వంద మందికి పైగా ఉగ్రవాదులను భారత సైన్యం నిర్మూలించింది.
భారత్ దాడులకు తట్టుకోలేకపోయిన పాకిస్తాన్ తర్వాత ప్రతిదాడులకు ప్రయత్నించి బిత్తరపోయింది
భారత్ జరిపిన దాడులను ఆపడంలో పాక్ పూర్తిగా విఫలమైంది. ఈ పరిస్థితుల్లో చైనా మద్దతు పాక్‌కు లభించినా, భారత్ శక్తికి తలొగ్గక తప్పలేదు.
వివరాలు
చైనా సాయంతోనూ నిలబడలేకపోయిన పాకిస్తాన్
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ చైనా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను వినియోగించి భారత్ దాడులను అడ్డుకునే ప్రయత్నం చేసింది.
కానీ భారత సైనిక దళాలు వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో పాక్‌కు పెద్ద దెబ్బతగిలింది.
చైనా సరఫరా చేసిన అత్యాధునిక వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్లను భారత్ కేవలం 23 నిమిషాల్లోనే ధ్వంసం చేసింది.
మొదట ఆ సిస్టమ్స్‌ను జ్యామ్ చేసి, ఆపై అవి పూర్తిగా పనిచేయకుండా చేయడంలో సక్సెస్ అయింది.
ఈ దాడులను అత్యంత ఖచ్చితంగా, లక్ష్యాన్ని చెరిగిపోనివిధంగా నిర్వహించామని భారత ఆర్మీ అధికారికంగా వెల్లడించింది.
వివరాలు
చైనా, టర్కీ ఆయుధాలను ధ్వంసం చేసిన భారత్
ఈ ఆపరేషన్‌లో చైనాకు చెందిన పీఎల్-15 క్షిపణులు, టర్కీ నుండి వచ్చిన యూఏవీలు (డ్రోన్లు), దీర్ఘశ్రేణి రాకెట్లు, క్వాడ్ కాప్టర్లు వంటి పరికరాలను భారత వాయుసేన లక్ష్యంగా చేసుకుని పూర్తిగా ధ్వంసం చేసింది.
పాకిస్తాన్ ఆధునిక ఆయుధ శక్తిని వినియోగించినప్పటికీ, భారతదేశం అభివృద్ధి చేసిన స్వదేశీ వైమానిక రక్షణ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ యుద్ధ పరికరాలను ఎదుర్కోవడంలో పాక్ పూర్తిగా విఫలమైంది.
వివరాలు
ప్రతీ లక్ష్యం హిట్టే..
ఆపరేషన్‌లో భాగంగా భారత వాయుసేన, పాకిస్తాన్‌లోని ముఖ్యమైన వైమానిక స్థావరాలు అయిన నూర్ ఖాన్, రహీమ్ యార్ ఖాన్ ప్రాంతాలను టార్గెట్ చేసింది.
పాక్ రాడార్లను, క్షిపణి వ్యవస్థలను ధ్వంసం చేయడంలో 'ఆత్మాహుతి డ్రోన్‌ల'ను సమర్థవంతంగా వినియోగించింది.
ప్రత్యేకంగా రూపొందించిన లాటరింగ్ అమ్యునిషన్ (మందుగుండు సామగ్రి) ద్వారా శత్రువు ఉన్న ప్రదేశాల్లో తగిన లక్ష్యాలను గుర్తించి, దానికి తగిన విధంగా దాడులు చేసింది.
ఇవి ముందుగా గాలిలో ప్రదక్షిణల చేస్తూ, ఆపై లక్ష్యంపై పేలే విధంగా తయారు చేయబడ్డాయి.
ఈ టెక్నాలజీ ఉపయోగంతో భారత వాయుసేన ఆపరేషన్ సిందూర్‌ను విజయం వైపు నడిపించిందని అధికారులు పేర్కొన్నారు.
వివరాలు
ఇస్రో కీలక పాత్ర
ఈ ఆపరేషన్‌లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో కీలక పాత్ర పోషించిందని సైనిక వర్గాలు వెల్లడించాయి.
మే 11వ తేదీ నుంచి ప్రారంభమైన ఆపరేషన్ సమయంలో, భారత పౌరుల భద్రతతో పాటు వ్యూహాత్మక ప్రయోజనాల కోసం కనీసం 10 ఉపగ్రహాలను 24 గంటలు పనిచేసేలా రూపొందించారని తెలిపారు.
ఇది కేవలం సైనిక విజయం మాత్రమే కాదు, భారత రక్షణ రంగం స్వదేశీకరణ దిశగా ఎలా ఎదుగుతోందో ప్రపంచానికి చూపించిన ఘట్టమని వివరించారు.
వాయు రక్షణ వ్యవస్థల నుంచి డ్రోన్ల వరకు భారతదేశం తయారు చేసిన హైటెక్ టెక్నాలజీ ఈ యుద్ధంలో కీలకంగా పనిచేసింది.
21వ శతాబ్దానికి తగిన హైటెక్ సైనిక శక్తిగా భారత్ తన పాత్రను విజయవంతంగా నిరూపించుకుంది.