కరోనాపై రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం; ఏప్రిల్ 10,11 తేదీల్లో దేశవ్యాప్తంగా మాక్‌డ్రిల్
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం మరోసారి రాష్ట్రాలను అలర్ట్ చేసింది. దేశంలో కరోనా సంసిద్ధతపై ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటికే లేఖలు రాసింది. కరోనా విషయంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు ఏప్రిల్ 10-11 తేదీలలో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌ను నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ సూచించారు. అయితే దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్‌తో పాటు కోవిడ్ సంసిద్ధతను సమీక్షించడానికి కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులు, సీనియర్ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు.
హెచ్1ఎన్1, హెచ్3ఎన్2 విజృంభణపై కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన
ఇటీవలే కేంద్ర ఆరోగ్య కార్యదర్శి, ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ రాజీవ్ బహ్ల్ రాష్ట్రాలు/యూటీల ప్రధాన కార్యదర్శులు, సీనియర్ ఆరోగ్య అధికారులకు ఇన్‌ఫ్లూయెంజా పరిణామ కారణాలపై (వ్యాధుల కారణాలు) లేఖ రాశారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తప్పనిసరిగా ఇన్‌ఫ్లూయెంజా లైక్ ఇల్‌నెన్( ఐఎల్ఐ), తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ (ఎస్ఏఆర్ఐ) వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారతదేశంలో సాధారణంగా జనవరి నుంచి మార్చి వరకు ఇన్‌ఫ్లూయెంజా కేసులు కాలానుగుణంగా పెరుగుతాయి. అలాగే ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు ఇన్‌ఫ్లూయెంజా వ్యాప్తి ఉంటుంది. ఇప్పుడు ఇన్‌ఫ్లూయెంజాతో పాటు దాని వైరియంట్లు హెచ్1ఎన్1, హెచ్3ఎన్2లు విజృంభిస్తుండటంపై కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసింది.
కరోనా నిబంధలు పాటించాలి: కేంద్ర ఆరోగ్య కార్యదర్శి
దేశంలో అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాల్లో నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ చెప్పారు. కానీ ఈ రాష్ట్రాల్లో ఆసుపత్రిలో చేరడం తక్కువగానే ఉందన్నారు. రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలని, తుమ్మినప్పుడు, దగ్గుతున్నప్పుడు రుమాలు అడ్డుగాపెట్టుకోవాలి, మాస్క్ ధరించాలని, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయొద్దని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి సూచించారు. ఇవి చేయడం వల్ల, కరోనాతో పాటు ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ల వ్యాప్తిని అడ్డుకోవచ్చని చెప్పారు. లక్షణాలు ఉన్నవారికి కరోనా పరీక్షలను తప్పినిసరిగా చేయాలని సూచించారు.