LOADING...
Polavaram Project: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Polavaram Project: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 29, 2025
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

పోలవరం-బనకచెర్ల నదుల అనుసంధాన పనులు ఇంకా ప్రారంభం కాలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం గట్టిగా అభ్యంతరాలు తెలిపిన సమయంలో,కేంద్రం ఈ వివరణ ఇచ్చింది. రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తూ, జల్ శక్తి మంత్రిత్వ శాఖ... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక (PFR) మాత్రమే సమర్పించిందని వివరించింది. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి లిఖితంగా స్పందించారు. ప్రాజెక్టును సాంకేతికంగా,ఆర్థికంగా పరిశీలించాల్సిన క్రమంలో ప్రాథమిక సాధ్యత నివేదికను మాత్రమే కేంద్ర జల సంఘానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించినట్లు తెలిపారు.

వివరాలు 

పోలవరం-బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించి ఏ పని కూడా ఇంకా ప్రారంభం కాలేదు

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నమోదు చేసిన అభ్యంతరాలను కూడా కేంద్రం స్వీకరించిందని చెప్పారు. "పోలవరం-బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించి ఏ పని కూడా ఇంకా ప్రారంభం కాలేదు" అని మంత్రి రాజ్ భూషణ్ స్పష్టం చేశారు. నదుల అనుసంధాన ప్రణాళికలో భాగంగా ఉన్న ఈ ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాస్పద అంశంగా మారింది. ముఖ్యంగా,నీటి లభ్యతపై, అంతర్రాష్ట్ర నీటి పంపక ఒప్పందాలపై దీని ప్రభావం ఉండొచ్చని తెలంగాణ అభిప్రాయపడుతోంది. ప్రాజెక్టును నిలిపివేయాలని తెలంగాణ అభ్యర్థించిందని, దాన్ని పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఆదేశాలు జారీచేస్తుందా? అనే ప్రశ్నకు సమాధానంగా - ఏ పనులు ప్రారంభం కాలేదు కాబట్టి ఆ విధమైన ప్రశ్నే తలెత్తదని మంత్రి స్పష్టం చేశారు.

వివరాలు 

ప్రాజెక్టుపై సాంకేతిక, ఆర్థిక అంచనా ప్రక్రియ

అయితే, తెలంగాణ నుంచి ప్రభుత్వం వద్దకు అభ్యంతరాలు వచ్చిన విషయాన్ని మంత్రి అంగీకరించారు. ప్రాజెక్టుపై సాంకేతిక, ఆర్థిక అంచనా ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును సమగ్రంగా అంచనా వేయడంలో కేంద్ర జల సంఘం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. గోదావరి నదీ మండలిలో భాగమైన తెలంగాణ సహా ఇతర భాగస్వామ్య రాష్ట్రాలు, వారి అధికారులతో చర్చించిన తర్వాతే, సాంకేతిక,ఆర్థిక అంశాలపై ముందుకు వెళతామని కేంద్రం స్పష్టం చేసింది.