Railway Line: తెలంగాణలో పెండ్యాల్-హసన్‌పర్తి బైపాస్ రైల్వేలైన్‌కు నోటిఫికేషన్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో రైల్వే లైన్ల అభివృద్ధికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అనేక మార్గాల్లో కొత్త రైల్వే లైన్లు నిర్మించారు.
హైదరాబాద్‌లో అతి పెద్ద రైల్వే టెర్మినల్ చర్లపల్లిలో నిర్మిస్తున్నది. తాజగా రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైన్ నిర్మించనున్నారు.
అందుకు సంబంధించి రైల్వేశాఖ తాజగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
హనుమకొండ, జనగామ జిల్లాల మధ్య ఈ రైల్వే లైన్ అందుబాటులోకి రానుంది.
హనుమకొండ జిల్లా హసన్‌పర్తి రోడ్డు నుంచి ధర్మసాగర్ మీదుగా నష్కల్ వరకు ఈ గూడ్స్ బైపాస్ లైన్ అందుబాటులోకి రానుంది.
ఈ రైల్వే లైన్ మొత్తం పొడవు 24.55 కి.మీ. కాగా, ఈ మేరకు భూసేకరణ కోసం కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.
వివరాలు
హసన్‌పర్తి, చిల్పూర్, ధర్మసాగర్ రెవెన్యూ అధికారులకు నోటిఫికేషన్
ముందుగా ఈ లైన్‌ను పెండ్యాల నుంచి 163వ నేషనల్ హైవే పక్కనుండి ప్రతిపాదించారు. అనంతరం బైపాస్ మార్గాన్ని మార్చుతూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది.
ధర్మసాగర్ మీదుగానే బైపాస్ లైన్ నిర్మాణానికి రైల్వేశాఖ సిద్ధమైంది.
బైపాస్ లైన్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ చేపట్టాలని హనుమకొండ, జనగామ జిల్లాల్లోని హసన్‌పర్తి, చిల్పూర్, ధర్మసాగర్ రెవెన్యూ అధికారులకు నోటిఫికేషన్ అందించింది.
ఈ లైన్‌తో పాటుగా నష్కల్ నుంచి మామునూరు మీదుగా గీసుకొండ మండలం చింతల్ రైల్వే స్టేషన్ వరకు రైల్వేశాఖ మరో బైపాస్ లైన్‌ను ప్రతిపాదించింది.
గూడ్స్ ట్రైన్లు బైపాస్‌ల మీదుగా పంపించి కాజీపేట, వరంగల్ స్టేషన్లపై ఒత్తడి తగ్గించాలని చూస్తున్నారు.
వివరాలు
బల్లార్షా- కాజీపేట మార్గంలో పెరుగుతున్న గూడ్స్ ట్రైన్ల సంఖ్య
ఈ లైన్ల వల్ల ప్రయాణికుల రైళ్ల రాకపోకలకు మార్గం సుగమం కానుంది. అందుకోసం ఈ రెండు మార్గాలను రైల్వేశాఖ ప్రతిపాదించింది.
బల్లార్షా- కాజీపేట మార్గంలో గూడ్స్ ట్రైన్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ఈ మార్గంలో ముందస్తుగా బైపాస్ లైన్ల నిర్మాణం చేయాలని రైల్వేశాఖ భావిస్తోంది.
హసన్‌పర్తి రోడ్డు నష్కల్ రైల్వే స్టేషన్ల మధ్య నిర్మించే బైపాస్ రైల్వే లైన్ నష్కల్ లేదా పెండ్యాల వద్ద 163వ నేషనల్ హైవేను క్రాస్ చేయాల్సి ఉంటుంది.
దాంతో పాటుగా, బైపాస్ వల్ల ఎక్కువగా ధర్మసాగర్ గ్రామ ప్రజలు, రైతులకు ఇబ్బంది కలిగే ఛాన్స్ ఉంది. అందుకని ఈ రెండు చోట్ల వంతెనల నిర్మాణం కోసం రైల్వే శాఖ ప్రణాళిక రచిస్తోంది.