
Andhra news: ఏపీలో కేంద్రం నిధులతో చేపట్టిన ప్రాజెక్టులపై.. గణాంక శాఖ నివేదిక
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన మూడు సాగునీటి ప్రాజెక్టులు ఇప్పటివరకు 83 శాతం పైగా పూర్తయినట్లు కేంద్ర గణాంకశాఖ వివరించింది. దేశవ్యాప్తంగా కేంద్ర నిధులతో సాగుతున్న రూ.150 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టుల పురోగతిని తాజాగా కేంద్ర గణాంకశాఖ వెల్లడించింది. అందులో రాష్ట్రంలో వివిధ శాఖలకు చెందిన 51 ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందని పేర్కొంది. రాష్ట్రంలో ఈ 51 ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం రూ.1.30 లక్షల కోట్లగా ఉండగా, తాజా అంచనాలు ఇప్పుడు రూ.1.84 లక్షల కోట్లకు పెరిగాయి, అంటే 41.21% పెరుగుదల. ఇప్పటివరకు వీటికి రూ.1.01 లక్షల కోట్లు (55.24%) ఖర్చు అయ్యింది.
వివరాలు
95% పూర్తైన సర్దార్ గౌతు-లచ్చన్న తోటపల్లి బ్యారేజీ
పోలవరం ప్రాజెక్టు విషయంలో అంచనా వ్యయం రూ.10,151.04 కోట్ల నుంచి ఏకంగా రూ.55,548.90 కోట్లకు (+447.23%) పెరిగింది. రాష్ట్రంలో కేంద్ర నిధులతో చేపడుతున్న ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయంలో పోలవరం ప్రాజెక్ట్ భాగం 30.13%గా ఉంది. ఇప్పటివరకు దీనికి రూ.24,347.76 కోట్లు ఖర్చుచేశారు. రాష్ట్రంలో కేంద్ర ప్రాజెక్టుల కోసం ఇప్పటివరకు ఖర్చు చేసిన మొత్తం వ్యయంలో పోలవరం ప్రాజెక్టుకే 23.90% ఉంది. పోలవరం ప్రాజెక్టును 2022 ఏప్రిల్‌లో పూర్తిచేయాలని నిర్ణయించగా, తాజా గడువును 2026 మార్చి వరకు పొడిగించారు. అంతేకాదు, సర్దార్ గౌతు-లచ్చన్న తోటపల్లి బ్యారేజీ 95% పూర్తయింది. దీన్ని 2026 జూన్‌లో పూర్తిచేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టింది. 98% పూర్తయిన గుండ్లకమ్మ ప్రాజెక్టు 2027 మార్చికి పూర్తిచేయాలని కూడా నిర్ణయించారు.
వివరాలు
కేంద్ర నిధులతో చేపడుతున్న రైల్వే పథకాలు
కేంద్ర నిధులతో చేపడుతున్న ప్రాజెక్టుల్లో రైల్వే పథకాలు అత్యధికంగా 28 ఉన్నాయి. వాటిలో: మలుగూరు-పాలసముద్రం మధ్య 17.97 కిమీ పొడవైన కొత్త రైల్వే, గుంతకల్లు వెస్ట్-మల్లప్ప గేట్ రైల్ ఓవర్ రైల్ ట్రాక్, తిరుపతి-కాట్పాడి మధ్య 104.39 కిమీ లైన్, గూడూరు-రేణిగుంట మధ్య 83.17 కిమీ మూడో లైన్, ముధ్‌ఖేడ్, మేడ్చల్ మహబూబ్‌నగర్, డోన్ సెక్టార్లలో 417.88 కిమీ డబ్లింగ్, విజయనగరం-సంబల్‌పుర్ మూడో లైన్, మల్కన్‌గిరి-పాండురంగాపురం మధ్య కొత్త రైల్వే, ఎర్రుపాలెం-అమరావతి నంబూరు రైల్వే లైన్
వివరాలు
ఇంకా జీరోలోనే ఉన్న పలు రైల్వే ప్రాజెక్టులు
కర్నూలు-3 PSR&E ట్రాన్స్‌మిషన్ లైన్,కర్నూలు-4 R&ED ఫేజ్-1 ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ ప్రాజెక్టులు కూడా ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. కర్నూలు,గుంటూరు,ప్రకాశం జిల్లాల్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టులు 6% మాత్రమే పూర్తయ్యాయి. 2022 మార్చిలో పూర్తికావాల్సిన ప్రాజెక్టు గడువును 2030 మార్చి వరకు పొడిగించారు. రూ.1,420 కోట్ల ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.165.65 కోట్లు ఖర్చు అయ్యాయి.పెట్రోలియం శాఖకు చెందిన విశాఖ-రాయ్‌పుర్ పైప్‌లైన్ ప్రాజెక్టు 8%మాత్రమే పూర్తయింది. 2024 సెప్టెంబరుకు పూర్తిచేయాల్సిన ప్రాజెక్టును 2027 సెప్టెంబరుకు వాయిదా వేశారు. రూ.2,212కోట్ల విలువైన ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.13.45కోట్లు ఖర్చు అయ్యాయి. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ప్రాజెక్టు 24%మాత్రమే పూర్తయింది. రూ.305కోట్ల ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.83.33 కోట్లు ఖర్చు అయ్యాయి. దీని పూర్తి గడువును 2027 జూన్‌గా నిర్ణయించారు.
వివరాలు
విమానాశ్రయాల పురోగతి ఇదీ..
విజయవాడ విమానాశ్రయం: కొత్త సమీకృత టెర్మినల్ నిర్మాణం 79% పూర్తయినట్లు కేంద్రం తెలిపింది. 2022 సెప్టెంబరుకి పూర్తికావాల్సిన గడువును 2025 డిసెంబరుకు పొడిగించారు. రూ.611.8 కోట్ల విలువైన ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.473.27 కోట్లు ఖర్చు అయ్యాయి. రాజమహేంద్రవరం విమానాశ్రయం: డొమెస్టిక్ టెర్మినల్ నిర్మాణం 51% పూర్తయింది. రూ.347.15 కోట్ల ప్రాజెక్టుకు రూ.90.56 కోట్లు ఖర్చు అయ్యాయి. ఈ సంవత్సరం డిసెంబరికి పూర్తి చేయాలనే లక్ష్యం ఉంది. కడప విమానాశ్రయం: కొత్త డొమెస్టిక్ టెర్మినల్, ఇతర నిర్మాణ, నిర్వహణ పనులు కలిపి 34% మాత్రమే పూర్తయ్యాయి. రూ.265.91 కోట్ల ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.50.06 కోట్లు ఖర్చు అయ్యాయి. మొత్తం పనులను 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టింది.