నేటి నుంచి తెలంగాణలో కేంద్ర బృందం పర్యటన.. వరద ప్రభావిత ప్రాంతాల సందర్శన
తెలంగాణలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు కేంద్ర బృందాలు రానున్నాయి. ఈ మేరకు నేటి నుంచి ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నాయి. గత కొద్ది రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించడంతో కుంభవృష్టి కురిసింది. దీంతో రాజధాని హైదరాబాద్ మహానగరంతో పాటు జిల్లాల్లోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా నీటి ప్రవాహం రావడంతో ఎక్కడికక్కడ గేట్లు తెరిచి నీటిని దిగువకు వదిలారు. నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివాసమున్న ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి కేంద్ర బృందం తెలంగాణలో పర్యటించనుంది. వరదల వల్ల జరిగిన నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేసేందుకు ఇప్పటికే సమాయత్తమైంది.
వరదల అంచనాపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కమిటీ
ఎడతెరిపి లేని వర్షాలు, వరదలతో చోటు చేసుకున్న నష్టాన్ని అంచనా వేయనున్నారు.దాదాపు వారం నుంచి 10 రోజుల పాటు కురిసిన భారీ వానలతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భారీగా జరిగింది. మరోవైపు వానలతో వేల ఎకరాల్లో పంట తుడిచిపెట్టుకుపోయింది. రోడ్లు, జాతీయ రహదారులు సైతం ధ్వంసమయ్యాయి. మరి కొన్ని చోట్ల వంతెనలు సైతం కూలిపోయాయి. ఈ మేరకే వరద నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి నివేదిక సమర్పించేందుకు వివిధ శాఖల అధికారులతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కమిటీని నియమించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నివేదికకు అదనంగా కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం సైతం వరదలపై కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదిక ఆధారంగానే కేంద్రం రాష్ట్రానికి సహాయ నిధులను కేటాయిస్తుంది.