జమ్ముకశ్మీర్ లో ఎప్పుడైనా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం.. సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
జమ్ముకశ్మీర్ లో ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించవచ్చని, అయితే నిర్ణయం ఎన్నికల సంఘం, రాష్ట్ర పోల్ ప్యానెల్‌దేనని కేంద్రం ఈరోజు సుప్రీంకోర్టుకు తెలిపింది. గత కొద్దిరోజులుగా సుప్రీంకోర్టులో ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరుగుతోన్న సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్ ఒకరకమైనదని, విభజన అవసరమని కేంద్రం గతంలో వాదించింది. మంగళవారం నాటి తన చివరి విచారణలో, జూన్ 2018 నుండి ఎన్నుకోబడిన ప్రభుత్వం లేకుండా ఉన్న జమ్ముకశ్మీర్ లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాల్సిన అవసరాన్ని సుప్రీం కోర్టు నొక్కి చెప్పింది. నేటి విచారణ సందర్భంగా, జమ్ముకాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణకు గడువు ఇవ్వడానికి కేంద్రం నిరాకరించింది.
లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్
లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగుతుందని సొలిసిటర్ జనరల్ చేసిన ప్రకటనపై లడఖ్ నాయకులు, పిటిషనర్లు తమ నిరాశను వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ అక్కడ పెద్దఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. 2019 ఆగస్టులో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత, తగిన సమయంలో రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని కేంద్రం చెప్పింది. హోంమంత్రి అమిత్ షా కూడా అదే విషయాన్ని పునరుద్ఘాటించారు కానీ అలాంటి చర్యకు ఎలాంటి గడువు విధించలేదు.