సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలపై కేంద్రం దేశద్రోహం అస్త్రం : అభిషేక్ సింగ్వి
దేశంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార భాజపాకు లేని పోనీ విషయాలన్నీ గుర్తుకొస్తాయని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ సింగ్వి ఎద్దేవా చేశారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సింగ్వి, అధికార భాజపా నేతల తీరుపై మండిపడ్డారు. దేశద్రోహం కేసులకు సంబంధించి జైలు శిక్షను కనీసం, మూడేళ్ల నుంచి ఏడేళ్లకు పెంచాలని జాతీయ లా కమిషన్ సిఫార్సు చేయడంపై సింగ్వి విస్మయం వ్యక్తం చేశారు. దేశద్రోహం అనే అస్త్రాన్ని ప్రతిపక్ష నేతలు, అసమ్మతివాదులపై మాత్రమే ప్రయోగిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే కేసులు బీజేపీ నేతలపై ఎందుకు పెట్టరని ఆయన ప్రశ్నించారు.
దేశద్రోహాన్ని క్రూరంగా మార్చాలనుకుంటున్నారు : సింగ్వి
దేశద్రోహన్ని విచ్చలవిడిగా వాడితే భారత గణతంత్ర పునాదులు కదులుతాయని సింగ్వి ఆవేదన వ్యక్తం చేశారు. తమకు లొంగని ప్రతిపక్ష పార్టీల నాయకులపై దేశద్రోహం కేసు పెడతారేమోనని భయపడాల్సి వస్తోందన్నారు. సార్వత్రిక ఎన్నికలకు వెళ్లే ముందు ఇదే విషయాన్ని భాజపా స్పష్టం చేయదల్చుకుందా అని నిలదీశారు. దేశద్రోహం చట్టానికి భారత లా కమిషన్ మద్దతునిస్తూ, దీని పునరుద్ధరణకు కేంద్రానికి సిపార్సు చేయడం అంటే ప్రతిపక్షాల గొంతు నొక్కడమేనని ఆయన అభివర్ణించారు. దేశద్రోహం చట్టం ఉపయోగిస్తూ నిబంధనలను మరింత కఠినంగా, క్రూరంగా మార్చాలని ఎన్డీఏ సర్కార్ యోచిస్తోందన్నారు. గతంలోనే ఐపీసీ సెక్షన్ 124ఏ ప్రకారం దేశద్రోహం శిక్షలను సుప్రీంకోర్టు నిలిపివేసినప్పటికీ, ఈ చట్టాన్ని ఎందుకు తొలగించకుండా మళ్లీ తెరపైకి ఎందుకు తెస్తుందో కేంద్రమే సమాధానం చెప్పాలన్నారు.