Page Loader
Online Registration of Property: ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి 117 ఏళ్ల నాటి చట్టానికి స్వస్తి.. కేంద్రం కొత్తచట్టం
కేంద్రం కొత్తచట్టం

Online Registration of Property: ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి 117 ఏళ్ల నాటి చట్టానికి స్వస్తి.. కేంద్రం కొత్తచట్టం

వ్రాసిన వారు Sirish Praharaju
May 29, 2025
10:32 am

ఈ వార్తాకథనం ఏంటి

భూముల రిజిస్ట్రేషన్‌ను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని రూపొందించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 117 ఏళ్ల పాత రిజిస్ట్రేషన్ చట్టమైన 1908 చట్టానికి బదులుగా,కేంద్రం ఆధునిక ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఈ విధానం ద్వారా ప్రజలు ఎలాంటి కార్యాలయాలకు వెళ్లకుండానే,ఇంటి నుంచే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకునే అవకాశాన్ని కల్పించనుంది. అంతేకాకుండా,అవసరమైన పత్రాలను ఈ-సర్టిఫికెట్ల రూపంలో పొందగలుగుతారు. ఈ కొత్త చట్టం ద్వారా పవర్ ఆఫ్ అటార్నీ,కొనుగోలు-అమ్మక ఒప్పందాలు(క్రయవిక్రయ ఒప్పందాలు) వంటి దస్తావేజుల రిజిస్ట్రేషన్ కూడా తప్పనిసరి చేయనున్నారు. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు తమ స్థాయిలో రిజిస్ట్రేషన్ చట్టాలలో మార్పులు చేస్తుండగా,కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వర్తించే సమగ్ర చట్టాన్ని రూపొందించేందుకు దృష్టి పెట్టింది.

వివరాలు 

సంబంధిత రికార్డులను డిజిటల్ ఫార్మాట్‌లో..

ఈ నూతన చట్టానికి సంబంధించిన ముసాయిదా ను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖలోని భూవనరుల విభాగం సిద్ధం చేసింది. దీనిపై ప్రజల అభిప్రాయాలు కూడా స్వీకరిస్తున్నారు. మే 27న ఈ ముసాయిదాను అధికారికంగా ఆన్‌లైన్‌లో ఉంచిన కేంద్ర ప్రభుత్వం, 30 రోజుల్లోగా పౌరులు తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరింది. ఈ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబడిన తరువాత, ఆమోదం పొందితే ఇది చట్టంగా మారుతుంది. అయితే, అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రంతో సంప్రదించి కొన్ని మార్పులు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కొత్త చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించబడుతుంది. సంబంధిత రికార్డులను డిజిటల్ ఫార్మాట్‌లో భద్రపరుస్తారు. రిజిస్ట్రేషన్‌కు అవసరమైన పత్రాలను కూడా ఆన్‌లైన్‌లో సమర్పించే వీలుంటుంది.

వివరాలు 

 ఆధార్ కార్డు ద్వారా ధ్రువీకరణ 

ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆధార్ కార్డు ద్వారా ధ్రువీకరణ జరుగుతుంది. ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్‌కు OTP పంపబడుతుంది. ఆ OTPను ఉపయోగించి ధ్రువీకరణను పూర్తి చేయవచ్చు. అయితే, ఇది తప్పనిసరి కాదు - ఆధార్ వివరాలు ఇవ్వడానికి ఇష్టంలేని వారికి ఇతర ప్రత్యామ్నాయాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ కొత్త విధానం ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినీతి, మోసాలను తగ్గించగలమని ప్రభుత్వం ఆశిస్తోంది. అలాగే, ఇది వేగంగా, పారదర్శకంగా, సులభంగా పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. ఆధార్ ఆధారిత ధ్రువీకరణతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేపట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

వివరాలు 

డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ వ్యవస్థకు మూలాధారంగా.. 1908 రిజిస్ట్రేషన్ చట్టం 

ఈ చట్టం దేశవ్యాప్తంగా అమలవుతుందని కేంద్రం స్పష్టం చేసింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వాలకు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఇంటి నుంచే పని పూర్తి చేసుకునే వీలుంటుంది. 1908లో వచ్చిన రిజిస్ట్రేషన్ చట్టం గత శతాబ్దానికి పైగా డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ వ్యవస్థకు మూలాధారంగా నిలిచింది. ఇది స్థిరాస్తులు,ఇతర లావాదేవీలకు సంబంధించి పత్రాల న్యాయబద్ధమైన నమోదుకు ఆధారంగా ఉపయోగపడుతోంది. కాలక్రమేణా, ఈ పత్రాలు ప్రజా, ప్రైవేట్ లావాదేవీల్లో కీలక పాత్ర పోషించాయి. ఇవి ఆర్థిక వ్యవస్థ నిర్వహణ, పాలన, న్యాయతీరులో కీలక ప్రమాణాలుగా మారాయి.

వివరాలు 

సమాజ అభివృద్ధి, సాంకేతిక ప్రగతి నేపథ్యంలో..

కాబట్టి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను బలమైనదిగా, నమ్మదగినదిగా మార్చి, సమాజ అభివృద్ధి, సాంకేతిక ప్రగతి నేపథ్యంలో సమకాలీనంగా రూపొందించాల్సిన అవసరం ఉందని కేంద్రం భావిస్తోంది. నేటి సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక-ఆర్థిక అభివృద్ధి, సేవల ప్రాప్తి, న్యాయ విచారణల్లో డాక్యుమెంట్ల ప్రాముఖ్యత పెరిగిన నేపథ్యంలో, పటిష్టమైన, నమ్మదగిన, సాంకేతికతకు అనుగుణంగా ఉండే రిజిస్ట్రేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.