Page Loader
gali janardhan reddy case: ఓబుళాపురం కేసులో అనూహ్య మలుపు.. ఒక్క రోజులో ముగ్గురు న్యాయమూర్తుల వైదొలగింపు!
ఓబుళాపురం కేసులో అనూహ్య మలుపు.. ఒక్క రోజులో ముగ్గురు న్యాయమూర్తుల వైదొలగింపు!

gali janardhan reddy case: ఓబుళాపురం కేసులో అనూహ్య మలుపు.. ఒక్క రోజులో ముగ్గురు న్యాయమూర్తుల వైదొలగింపు!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 29, 2025
10:31 am

ఈ వార్తాకథనం ఏంటి

ఒక కేసు విచారణ నుంచి న్యాయమూర్తి తప్పుకోవడం సాధారణమే అయినా, ఒకే కేసులో ఒకే రోజున ముగ్గురు న్యాయమూర్తులు విచారణ నుంచి తప్పుకోవడం అరుదైన సంఘటన. ఈ అసాధారణ పరిణామానికి తెలంగాణ హైకోర్టు వేదికగా మారింది. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో దోషులుగా భావించిన వ్యక్తులు హైకోర్టులో అప్పీళ్లను దాఖలు చేయగా, విచారణకు వచ్చిన మూడుగురు న్యాయమూర్తులు వరుసగా విచారణ నుంచి తప్పుకున్నారు. సీబీఐ కోర్టు మే 6న ఓబుళాపురం కేసులో ఏడేళ్ల శిక్ష విధించిన తీర్పుపై గాలి జనార్దన్‌రెడ్డి, బి.వి.శ్రీనివాసరెడ్డి, ఓఎంసీ కంపెనీ, మెఫజ్ అలీఖాన్, వి.డి.రాజగోపాల్‌లు హైకోర్టులో శిక్ష సస్పెన్షన్ కోసం పిటిషన్‌లు దాఖలు చేశారు. ఇందులో గాలి జనార్దన్‌రెడ్డి త‌న శిక్షను పూర్తిగా రద్దు చేయాలని ప్రత్యేకంగా కోరారు.

Details

బెయిల్ మంజూరు చేయాలని వాదనలు

ఈ నెల 21న మొదటిగా జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావు ఈ పిటిషన్‌లపై విచారణ చేపట్టారు. సీనియర్ న్యాయవాదులు మూడున్నరేళ్లకుపైగా దోషులు జైల్లో గడిపిన నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ, తక్షణ శిక్ష నిలిపివేతతోపాటు బెయిలు మంజూరు చేయాలని వాదించారు. అయితే, సీబీఐ స్పందన లేకుండా ఉత్తర్వులివ్వలేమంటూ న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. బుధవారం ఈ పిటిషన్‌లు జస్టిస్ కె. శరత్ బెంచ్ ముందుకు విచారణకు వచ్చాయి. అయితే ఉదయం కోర్టు ప్రారంభ సమయంలోనే ఆయన ఈ కేసులను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. తర్వాత ఇవే కేసులు జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణ ముందు విచారణకు రావడంతో ఆయన సాయంత్రం 7 గంటల సమయంలో విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.

Details

విచారణ జరగలేదు

దీంతో న్యాయవాదులు ఈ కేసులను సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఇద్దరు న్యాయమూర్తులు ఇప్పటికే తప్పుకున్న నేపథ్యంలో తాను విచారణ చేపట్టాలని కోరారు. ఫైళ్లు పరిశీలించిన జస్టిస్ భీమపాక, ఇవి ఓబుళాపురం కేసుతో సంబంధం ఉన్నాయనీ, తాను కూడా విచారణ నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించారు. ఈ పరిణామాలతో, గాలి జనార్దన్‌రెడ్డితో పాటు మిగతా దోషుల పిటిషన్‌ల విచారణ వారం పాటు వాయిదా పడింది. ఈ కేసులో వాదనలు వినిపించేందుకు దోషుల తరఫున న్యాయవాదులు వాసిరెడ్డి విమల్‌వర్మ,నాగముత్తు, పప్పు నాగేశ్వరరావు, సురేశ్, బి.నళిన్‌కుమార్‌లు పాల్గొనగా, సీబీఐ తరఫున శ్రీనివాస్ కపాటియా హాజరయ్యారు. ఉదయం నుంచి రాత్రి 7.30 గంటల దాకా వారు కోర్టులో వేచి కూర్చున్నా, విచారణ జరగలేదు.