
Purandeswari: మతపరమైన అంశాల్లో కేంద్రం జోక్యం చేయదు : ఏపీ బీజేపీ చీఫ్
ఈ వార్తాకథనం ఏంటి
బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని సమరసతా దినంగా నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు.
జాతీయ రాజకీయాల్లో ఆయన చేసిన విశేష సేవలు గుర్తించదగ్గవని పేర్కొన్నారు.
పార్లమెంటులో 40 ఏళ్ల పాటు విరామం లేకుండా కొనసాగిన జగజ్జీవన్ రామ్, 30 సంవత్సరాలపాటు మంత్రిగా దేశానికి సేవలందించారని ఆమె గుర్తు చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందన్నారు.
PMAY (ప్రధానమంత్రి అవాస్ యోజన) కింద మహిళలతో పాటు ఎస్సీ, ఎస్టీలకు ఇళ్లను కేటాయించడం మోదీ సర్కార్ ఘనత అని తెలిపారు.
Details
బిల్లు చట్టంగా మారనుంది
అలాగే స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా పథకాల ద్వారా 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి యువతను ఎదిగించేందుకు కేంద్రం పని చేస్తోందన్నారు.
ప్రత్యేకంగా దళితుల కోసం డిక్కీ అనే సంస్థను ప్రధాని ప్రారంభించారని చెప్పారు.
అలాగే, బీజేపీ ప్రభుత్వం చేపట్టిన త్రిపుల్ తలాక్ నిషేధం, ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వ బిల్లు (CAA) వంటి నిర్ణయాలను పురంధేశ్వరి ప్రస్తావించారు.
త్వరలో వక్ఫ్ సవరణ బిల్లు చట్టంగా మారనున్నట్లు తెలిపారు.
సోనియా గాంధీ వక్ఫ్ బిల్లుపై అప్రజాస్వామికంగా ఉందని వ్యాఖ్యానించినా, అప్పట్లో ఆమె రాజ్యసభలో ఉన్నారో లేదో స్పష్టత లేదని, రాహుల్, ప్రియాంకలు కూడా ఎక్కడా కనిపించలేదని విమర్శించారు.
Details
వక్ఫ్ బోర్డు బిల్లుకు అమోదం
వక్ఫ్ బిల్లు మే 3న లోక్ సభలో, మే 4న రాజ్యసభలో ఆమోదం పొందిందని తెలిపారు.
ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి (JPC) పంపారని, దేశవ్యాప్తంగా 92 లక్షల పిటిషన్లు, 25 రాష్ట్రాల వక్ఫ్ బోర్డుల నుంచి ప్రతినిధులు తమ అభిప్రాయాలు పంపారని వివరించారు.
మొత్తంగా కోటిన్నర ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించామని పేర్కొన్నారు.
అల్లా మీద విశ్వాసంతో భూమిని ధార్మిక కార్యకలాపాలకు వినియోగిస్తే అది వక్ఫ్ భూమిగా గుర్తిస్తారని వక్ఫ్ బోర్డులో మాత్రమే సవరణలు జరిగాయని, మతపరంగా కేంద్రం ఎటువంటి జోక్యం చేయలేదని స్పష్టంచేశారు.
Details
వక్ఫ్ బోర్డులో సవరణలు మాత్రమే
2013లో యూపీఏ ప్రభుత్వం వక్ఫ్ బోర్డులో సవరణలు చేసి మైనారిటీలలో విభజనకు దారితీసేలా పనిచేసిందని ఆమె ఆరోపించారు.
దేశంలో రైల్వే, డిఫెన్స్ తర్వాత అత్యధిక భూములను కలిగిన వక్ఫ్ బోర్డు వద్ద ఉన్న 9.5 లక్షల ఎకరాల భూమి సరైన రీతిలో వినియోగిస్తే మైనారిటీ వర్గాల సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు.
అలాగే, వక్ఫ్ బోర్డులో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించామని, ఆర్టికల్ 14కు అనుగుణంగా సవరణలు చేశామని పురంధేశ్వరి స్పష్టం చేశారు.