Chandra Babu: చంద్రబాబు కీలక నిర్ణయం.. సచివాలయ వ్యవస్థలో సంస్కరణల పునఃప్రారంభం.. రివర్స్ టెండరింగ్స్ రద్దు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన, రివర్స్ టెండర్స్ ను రద్దు చేయాలని నిర్ణయించుకుంది. అదే విధంగా మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లను సైతం రద్దు చేయాలని భావిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ అంశాలపై వాడివేడిగా చర్చ సాగింది. పెన్షన్ల పంపిణీ తప్ప, ఇతర విధుల కోసం ప్రత్యేకంగా ఆదేశాలు లేకపోవడంతో సచివాలయ వ్యవస్థ సమర్ధవంతంగా పనిచేయడంలో విఫలమైంది.
ఎక్సైజ్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు
రేషన్ దుకాణాలకు ప్రత్యామ్నయంగా తీసుకువచ్చిన మొబైల్ డెలివరీ యూనిట్లను రద్దు చేసేందుకు కేబినెట్ ముందుకొచ్చింది. ఎండియూలను రద్దు చేసి, మునుపటి తరహాలో రేషన్ దుకాణాలను కొనసాగించాలన్న అంశంపై కేబినెట్‌లో చర్చ జరగడం గమనార్హం. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (సెబ్) రద్దు కోసం కూడా చర్యలను తీసుకోనుంది. ఇక ఎక్సైజ్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా సెబ్ రద్దు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
పాత టెండర్ల విధానంపై చర్చ
జలవనరుల శాఖ నివేదిక ఆధారంగా రివర్స్ టెండరింగ్ విధానం రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. 2014-19లో ఉన్న పాతటెండర్ల విధానాన్నే మళ్లీ తీసుకొచ్చేందుకు ప్రణాళికలను చేపట్టింది. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు 500 రకాల సేవలు అందేవి. తాజాగా సచివాలయ వ్యవస్థను ప్రక్షాళన చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పునర్య్వస్థీకరించే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.