Chandra Babu: ఏపీలో భారీ వర్షాలపై చంద్రబాబు సమీక్ష.. అప్రమత్తంగా ఉండాలని సూచన
ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా ఉండేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండి, తగిన సూచనలు చేయాలని ఆయన ఆదేశించారు. అవసరమైతే, సహాయక చర్యలు తక్షణమే ప్రారంభించడానికి సిబ్బంది సిద్ధంగా ఉండాలని చెప్పారు. ముఖ్యంగా, మ్యాన్‌హోల్‌లు, కరెంట్ తీగల సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాగులు, వంకల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
విజయవాడలో అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి నారాయణ
విజయవాడలో వర్ష పరిస్థితులపై మంత్రి నారాయణ అధికారులను అప్రమత్తం చేశారు. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్రతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు, రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డ్రైనేజీ వ్యవస్థకు ఆటంకం లేకుండా సిబ్బందిని అప్రమత్తం చేయాలన్నారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.