Page Loader
చంద్రయాన్‌-3లో తెలంగాణ శాస్త్రవేత్త.. సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్ రాసిన గద్వాల యువకుడు
సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్ రాసిన గద్వాల యువకుడు

చంద్రయాన్‌-3లో తెలంగాణ శాస్త్రవేత్త.. సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్ రాసిన గద్వాల యువకుడు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 23, 2023
09:47 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ దేశాలు ఆసక్తిగా తిలకిస్తున్న చంద్రయాన్-3 ప్రాజెక్టులో తెలంగాణకి చెందిన యువ శాస్త్రవేత్త భాగమయ్యాడు. జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవల్లికి చెందిన కృష్ణ కుమ్మరి రెండు పేలోడ్స్‌ కోసం సాఫ్ట్‌వేర్‌ రాశారు. మిషన్‌లోని 2 పేలోడ్స్‌లో ఐదుగురు పనిచేయగా, వారిలో ఎల్‌హెచ్‌వీసీ, ఐఎల్‌ఎస్‌ఏ పేలోడ్స్ కు కృష్ణ కుమ్మరి డేటా ప్రాసెసింగ్‌ అనాలసిస్‌ సాఫ్ట్‌వేర్‌ రాశారు. LHVC అంటే హారిజాంటల్‌ వెలాసిటీ గురించి వివరిస్తుంది. ILSA అంటే చంద్రుడిపై వచ్చే కంపనాలను గుర్తించి నమోదు చేస్తుంది. ఈ రెండు సాఫ్ట్‌వేర్‌ పేలోడ్స్‌ నుంచి వచ్చే డేటాని ISTRAC బెంగళూరు కేంద్రం అందుకుంటుందని కృష్ణ పేర్కొన్నారు. మిషన్‌ కోసం సుమారు 6నెలలుగా పని చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ మేరకు ప్రాజెక్ట్ వంద శాతం విజయవంతమవుతుందన్నారు.

details

ఇస్రో పరీక్షలో జాతీయ స్థాయిలో 4వ ర్యాంకు

కూలీ పనులతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న లక్ష్మీదేవి, మద్దిలేటి దంపతులకు ఇద్దరు సంతానం. వారిలో కుమార్తె శకుంతల, కుమారుడు కృష్ణ కుమ్మరి ఉన్నారు. ఉండవల్లిలోని జడ్పీ స్కూల్లో 2008లో పదో తరగతి పూర్తి చేసిన కృష్ణ, మూడేళ్లు తిరుపతిలో డిప్లొమా ఇన్‌ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ (DCME) చేశారు. తర్వాత ఈ-సెట్‌ పరీక్షతో CS (కంప్యూటర్‌ సైన్స్‌)లో ఇంజినీరింగ్ చదివారు. ఈ మేరకు టెరా డేటా రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేశారు. ఈ క్రమంలోనే ఇస్రో సెంట్రలైజడ్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు పరీక్షలో జాతీయ స్థాయిలో 4వ ర్యాంకుతో మెరిశారు. దీంతో 2018లో గ్రూప్‌ 'ఏ' గెజిటెడ్ అధికారిగా యూఆర్‌రావు శాటిలైట్‌ కేంద్రంలో కొలువు సాధించారు.

DETAILS

ఆయుర్వేదంతో పోలియోను జయించిన కృష్ణ 

తనకు ఐదేళ్లు ఉన్నప్పుడు పోలియో వచ్చిందని, ఈ క్రమంలోనే నరాలు చచ్చుబడ్డాయని శాస్త్రవేత్త కృష్ణ తెలిపారు. ఈ మేరకు అయిజలోని ఆయుర్వేద వైద్యుడు రామేశ్వర్‌రెడ్డి వద్ద వైద్యచికిత్సలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. 10 ఏళ్లు వచ్చేసరికి స్వతంత్రంగా లేవగలిగేవాడినని, తన పనులు తానే చేసుకునే స్థితికి చేరుకున్నట్లు తెలిపారు.ఇలా దాదాపు 23 ఏళ్ల పాటు ఆయుర్వేద మందులు వాడానని చెప్పుకొచ్చారు. మరోవైపు తోకవడ్లతో చేసిన గంజి శరీరానికి మర్దన చేసుకున్నట్లు చెప్పారు. గంజి రాసుకున్నాక సుమారు గంట తర్వాత స్నానం చేస్తే నరాల్లో రక్త ప్రసరణ జరిగి కండరాలు వదులు అయ్యేవని వివరించారు. ఈ నేపథ్యంలోనే తనకు తల్లిదండ్రులు జన్మనిస్తే, వైద్యుడు పునర్జన్మనిచ్చారన్నారు. తన తాత స్ఫూర్తితోనే ముందుకు సాగుతున్నట్లు కృష్ణ స్పష్టం చేశారు.