Telangana: రుణమాఫీ సమస్యలకు చెక్.. రేవంత్ ప్రభుత్వం ప్రత్యేక యాప్
రుణమాఫీ సమస్యలకు తెలంగాణ ప్రభుత్వం చెక్ పెట్టనుంది. అర్హులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. దీని కోసం ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా రుణమాఫీ కోసం అర్హులైన రైతుల తమ వివరాలను సులభంగా నమోదు చేసుకోవచ్చు. రైతు భరోసా పంట రుణమాఫీ యాప్‌ను వ్యవసాయ శాఖ ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా రుణమాఫీ సమస్యలను పరిష్కరించనుంది. ఇప్పటికే యాప్ డిజైన్ పూర్తికాగా, మంగళవారం నుంచి ఈ యాప్ అందుబాటులోకి రానుంది.
సంతోషం వ్యక్తం చేసిన రైతులు
యాప్‌లో అర్హులైన రైతుల వివరాలను నమోదు చేసేందుకు క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. రైతుల ఇళ్లకు వెళ్లి, రుణ ఖాతాలు, రేషన్ కార్డు, ఆధార్ తదితర పత్రాలను పరిశీలించనున్నారు. ఇక పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించేందుకు వ్యవసాయశాఖ సిద్ధమైంది. చాలా మంది రైతులు రుణమాఫీ జరగలేదని ఫిర్యాదు చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ యాప్ కీలక పాత్ర పోషించనుంది. ఈ యాప్ ద్వారా సులభంగా రుణమాఫీ సమస్యలను పరిష్కరించుకోగలమని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.