Maharastra: ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం తయారుచేసిన శిల్పి జైదీప్ ఆప్టే అరెస్టు
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనలో, పోలీసులు శిల్పి జైదీప్ ఆప్టేని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే పలు కేసులు నమోదు చేసిన పోలీసులు, ఆగస్టు 26న ప్రారంభించిన విగ్రహం కొద్ది నెలల్లోనే కూలిపోవడం వల్ల ఆప్టేపై దృష్టి పెట్టారు. పోలీసుల సమాచారం ప్రకారం, ఆప్టేను అరెస్ట్ చేయడానికి ఏకంగా 7 బృందాలను ఏర్పాటు చేశారు. బుధవారం అతని ఇంటి బయట, తన కుటుంబాన్ని కలిసేందుకు వచ్చిన సందర్భంలో, అతని భార్య సాయంతో పోలీసులు ఆప్టేను అరెస్ట్ చేశారు. ఆమె అతని రాకను పోలీసులకు తెలియజేసినట్లు తెలుస్తోంది.
కోల్హాపూర్‌లో చేతన్ పాటిల్ అరెస్ట్
విగ్రహం కూలిన తర్వాత, మాల్వాన్ పోలీసులు శిల్పి ఆప్టే, నిర్మాణ సలహాదారు చేతన్ పాటిల్‌పై నిర్లక్ష్యం,ఇతర నేరాలకు సంబంధించి కేసులు నమోదు చేశారు. చేతన్ పాటిల్‌ను గత వారం కోల్హాపూర్‌లో అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుపై బీజేపీ నేత ప్రవీణ్ దార్కర్ స్పందిస్తూ, ప్రభుత్వం పై విమర్శలు చేసిన వారు ఇప్పుడు నోరుమూసుకోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. శివసేన నాయకురాలు సుష్మా అంధారే ఈ విషయంపై స్పందిస్తూ, ఆప్టే అరెస్టు చేయడం ప్రభుత్వ విధి మాత్రమేనని, అది క్రెడిట్ తీసుకోవడానికి ఉపయోగించకూడదని వ్యాఖ్యానించారు.