Page Loader
'సుస్వాగతం'తో సుప్రీంకోర్టులోకి ప్రవేశం.. ఈ-పాస్‌ జారీ కోసం నూతన వ్యవస్థ ప్రారంభం
'సుస్వాగతం'తో సుప్రీంకోర్టులోకి ప్రవేశం

'సుస్వాగతం'తో సుప్రీంకోర్టులోకి ప్రవేశం.. ఈ-పాస్‌ జారీ కోసం నూతన వ్యవస్థ ప్రారంభం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 10, 2023
05:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

సుప్రీంకోర్టులో కొత్త వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. సులువుగా ఈ-పాస్‌లు పొందేందుకు కొత్త పోర్టల్‌ ప్రారంభమైంది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానానికి వచ్చే పిటిషనర్లు, న్యాయవాదులు, సందర్శకులు సులువుగా పాస్‌లు అందిపుచ్చుకోవచ్చు. ఇందుకోసం సుస్వాగతం అనే కొత్త పోర్టల్‌ను గురువారం సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌ ప్రారంభించారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టనుంది. అంతకుముందే సుస్వాగతం పోర్టల్‌ ఆవిర్భావాన్ని సీజేఐ ప్రకటించేశారు. పాస్‌ల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు కౌంటర్ల వద్ద క్యూలో నిలబడాల్సిన పని లేదని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తెలిపారు. ఇకపై అన్ని రకాల పాస్‌లు ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉంటాయన్నారు.

DETAILS

పోర్టల్ ఉపయోగించే విధానం తెలుసుకునేందుకు వీడియో అందుబాటులో ఉంచాం : సీజేఐ 

సుస్వాగతం పోర్టల్ ను ఉపయోగించే విధానాన్ని వివరించేందుకు అందులోనే ఓ వీడియోను అందుబాటులో ఉంచినట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ వెల్లడించారు. సుస్వాగతం పోర్టల్ వెబ్‌, మొబైల్‌ ఆధారంగా నిర్వహించుకోవచ్చు. తమ వివరాలను ఇందులో నమోదు చేసి ఈ-పాస్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. జులై 25, 2023 నుంచి పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఈ పోర్టల్‌ను పరీక్షించినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పోర్టల్ పనితీరుపై వినియోగదారులు సానుకూలంగా అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా సుమారు 10 వేలకుపైగా ఈ-పాస్‌లను జారీ చేశామని, గురువారం నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు.

DETAILS

యూజర్‌ ప్రెండ్లీగా మార్చేందుకే పోర్టల్ రూపకల్పన

ఉదయం వేళల్లో కోర్టులోకి వచ్చేందుకు కావాల్సిన పాస్‌లు పొందాలంటే సుప్రీంకోర్టు కౌంటర్‌ ముందు భారీ క్యూ ఉండేదని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అన్నారు. ఇకపై అలాంటి క్యూ పరిస్థితులు ఉండవని హర్షం వ్యక్తం చేశారు. సుస్వాగతం పోర్టల్‌ ద్వారా వినియోగదారుల అవసరాల మేరకు ఈ-పాస్‌లను పొందొచ్చు. వివరాలను నమోదు చేసే క్రమంలో యూజర్లు తగిన ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.అంతేకాకుండా లైవ్‌ ఫొటోను కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్‌ లేదా పోర్టల్‌ ద్వారా పొందిన ఈ-పాస్‌పై క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది. దాన్ని స్కాన్‌ చేసి కోర్టు లోపలికి, బయటికి వెళ్లేందుకు అనువుగా తీర్చిదిద్దారు. సుప్రీంలో కోర్టు సేవలను యూజర్‌ ప్రెండ్లీగా మార్చేందుకే సీజేఐ పోర్టల్ రూపకల్పన చేయించినట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.