భారతదేశాన్ని విభజించే భావజాలం ప్రతిపక్షాలది.. ప్రతిపక్షాలపై కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఫైర్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా అవిశ్వాసంపై మూడో రోజు కూడా వాడీవేడీ చర్చ సాగింది. మణిపూర్ అంశంపై అవిశ్వాస తీర్మానంపై లోక్ సభ లో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మణిపూర్ భారత్‌లో భాగం కాదని ప్రధాని భావిస్తున్నట్లు నిన్న రాహుల్ గాంధీ అన్నారని, అయితే ఈశాన్య ప్రాంతాలను ప్రపంచంతో ప్రధాని నరేంద్ర మోదీ ముడిపెట్టారని కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా పేర్కొన్నారు. భారతదేశాన్ని విభజించే సిద్ధాంతం ప్రతిపక్షాలదేనని, తమ ప్రభుత్వాన్ని కాదని ఆయన పేర్కొన్నారు.
సింధియా మాట్లాడుతుండగా ఇండియా కూటమి ఎంపీలు వాకౌట్
తాను 20 ఏళ్లుగా పార్లమెంట్‌లో ఉన్నానని, కానీ ఇలాంటివి ఎన్నడూ చూడలేదని, ఈ అవిశ్వాస తీర్మానం మణిపూర్ గురించి కాదని, వారి స్వార్థ ప్రయోజనాల కోసం వాడుతున్నారని చెప్పారు. గతంలో 1993, 2011లో మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు జరిగినప్పుడు మాజీ ప్రధానులు పివి నరసింహారావు, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎందుకు మౌనం వహించారని సింధియా ప్రశ్నించారు. అవిశ్వాసంపై జ్యోతిరాధిత్య సింధియా ప్రసంగిస్తున్న సమయంలో ఇండియా కూటమి ఎంపీలు వాకౌట్ చేశారు. దీనిపై సింధియా మాట్లాడుతూ లోక్‌సభ నుంచి వాళ్లు బయటికి వెళ్లిపోయారు కానీ, దేశ ప్రజలు ఎప్పుడో వాళ్లని సాగనంపారని సింధియా సెటైర్ వేశారు.