
DGCA: విమాన టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో విండో షేడ్స్ మూసేయండి.. డీజీసీఏ కీలక ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) భారతదేశంలోని కమర్షియల్ విమానాల కోసం కొత్త భద్రతా మార్గదర్శకాలను జారీ చేసింది. ముఖ్యంగా పాకిస్థాన్ సరిహద్దులకు సమీపంలోని పశ్చిమ భారత వైమానిక స్థావరాలపై ఈ నిబంధనలు వర్తిస్తాయి. రక్షణ శాఖ నియంత్రణలో ఉన్న ఎయిర్‌బేస్‌ల నుంచి టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో విండో షేడ్స్ (విమాన కిటికీలను కప్పే కవర్‌లు) మూసివేయాల్సిందిగా సూచించింది. ఈ నిబంధనలు టేకాఫ్ తర్వాత విమానం 10,000 అడుగుల ఎత్తుకు చేరేవరకు, అలాగే ల్యాండింగ్ సమయంలో అదే ఎత్తు దిగేవరకు అమల్లో ఉంటాయి. అయితే అత్యవసర నిష్క్రమణ విండోలకు మాత్రం మినహాయింపు ఉంటుందని డీజీసీఏ స్పష్టం చేసింది. ఈచర్యలు భారత్-పాకిస్థాన్ మధ్య ఇటీవల జరిగిన ఉద్రిక్త ఘటనల నేపథ్యంలో తీసుకున్నట్లు భావించవచ్చు.
Details
ఎయిర్‌బేస్ ప్రాంతాల్లో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీపై నిషేధం
ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో పాక్ ప్రేరేపిత ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. దానికి ప్రతిగా భారత భద్రతా దళాలు 'ఆపరేషన్ సిందూర్' పేరుతో సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించాయి. అనంతరం రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా, ఇంకా దౌత్య సంబంధాలు కుదుటపడలేదని విశ్లేషణలు చెబుతున్నాయి. ఇప్పటికే ఎయిర్‌బేస్ ప్రాంతాల్లో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీపై నిషేధం అమలులో ఉంది. దీన్ని ప్రయాణికులకు ముందుగానే తెలియజేయాలని, ఉల్లంఘనకు సంబంధించి తీసుకునే చర్యల వివరాలను స్పష్టంగా తెలియజేయాలని డీజీసీఏ అన్ని విమానయాన సంస్థలకు సూచించింది. ప్రయాణికులు రక్షణపరమైన సమాచారాన్ని బయటపెట్టకుండా నిరోధించటమే దీని ప్రధాన ఉద్దేశ్యమని తెలిపింది.
Details
కచ్చితంగా పాటించాల్సిన విమానాశ్రయాలివే
లేహ్, శ్రీనగర్, జమ్ము, పఠాన్‌కోట్, ఆదంపుర్, చండీగఢ్, బఠిండా, జైసల్మేర్, నాల్, జోధ్‌పూర్, హిండన్, ఆగ్రా, కాన్పూర్, బరేలీ, మహారాజ్‌పుర్, గోరఖ్‌పూర్, భుజ్, లొహెగావ్, డాబోలిమ్ (గోవా), విశాఖపట్నం. ఈ మార్గదర్శకాలు ఆపరేషనల్ భద్రతను బలోపేతం చేయడమే కాకుండా, దేశ రక్షణ వ్యవస్థను కాపాడటానికి కీలకంగా నిలవనున్నాయి.