
Kishtwar Cloudburst: క్లౌడ్ బరస్ట్ బీభత్సం.. 500 మందికి పైగా గల్లంతు : ఫరూక్ అబ్దుల్లా
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్‌లో మేఘ విస్ఫోటం (క్లౌడ్ బరస్ట్) భారీ విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఆకస్మిక వరదలతో ఇప్పటివరకు 60 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో 500 మందికి పైగా గల్లంతైనట్లు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా వెల్లడించారు. కిశ్త్‌వాడ్‌లో జరిగిన ఈ క్లౌడ్ బరస్ట్‌లో 500 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకున్నట్లు భావిస్తున్నాం. కొందరు అధికారులు ఈ సంఖ్య వెయ్యి దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది చాలా విషాదకరమైన ఘటన అని ఆయన అన్నారు.
Details
గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి
గతేడాది అక్టోబర్‌లో జమ్ముకశ్మీర్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రసంగించారు. ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎంతో విలువైన ప్రాణాలను కాపాడేందుకు సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు. మేఘ విస్ఫోటం మచైల్ మాతా దేవి దర్శనానికి వెళ్తున్న యాత్రికులపై విరుచుకుపడింది.
Details
ప్రస్తుతం ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున సహాయక చర్యలు
ఒక్కసారిగా వచ్చిన ఆకస్మిక వరదల్లో 60 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గల్లంతయ్యారు. మరణించిన వారిలో ఇద్దరు సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది కూడా ఉన్నారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడి, ఘటనా స్థల పరిస్థితులు, జరుగుతున్న సహాయక చర్యలపై వివరాలు అడిగారని సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ఈ విపత్తులో నష్టపోయిన వారికి సహాయం అందించిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున రక్షణ, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీసులు, సైన్యం, స్థానిక వాలంటీర్లు సమన్వయంతో ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు