LOADING...
Cloudburst In Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్‌లో మరో క్లౌడ్‌ బరస్ట్‌.. గ్రామాలను ముంచెత్తుతున్న వరదలు
ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్‌లో మరో క్లౌడ్‌ బరస్ట్‌.. గ్రామాలను ముంచెత్తుతున్న వరదలు

Cloudburst In Uttarakhand: ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్‌లో మరో క్లౌడ్‌ బరస్ట్‌.. గ్రామాలను ముంచెత్తుతున్న వరదలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 29, 2025
10:47 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్, చమోలి జిల్లాల వద్ద కురుస్తున్న కుండపోత వర్షాలు పలు గ్రామాలను పూర్తిగా ముంచేస్తున్నాయి. రాష్ట్రంలో తాజాగా మరోసారి మేఘ విస్ఫోటం (Cloudburst) సంభవించడంతో పరిస్థితులు మరింత గందరగోళంగా మారాయి. ఈ విపత్తులో అనేక మంది ప్రాణాలు కోల్పోగా, ఇళ్లు కూలడంతో పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల కింద చిక్కుకున్నారు. మోపాటా ప్రాంతంలో భారీ వరదల్లో ఇద్దరు వ్యక్తులు కొట్టుకుపోగా.. అదేవిధంగా పశువుల కొట్టం కూలిపోవడం వల్ల దాదాపు 20 పశువులు జలసమాధి అయ్యాయి.

వివరాలు 

180కి పైగా రోడ్లు మూసుకుపోయాయి

మేఘ విస్ఫోటం కారణంగా రుద్రప్రయాగ్‌లో అలకనంద, మందాకిని నదుల నీటి మట్టాలు భయంకరంగా పెరిగాయి. రుద్రప్రయాగ్‌లోని ప్రసిద్ధ హనుమాన్ ఆలయం కూడా పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. అంతేకాక, కొండచరియలు విరిగిపోవడంతో 180కి పైగా రోడ్లు మూసుకుపోయాయి. కేదార్‌నాథ్ లోయలోని లారా గ్రామాన్ని పట్టణంతో కలిపే వంతెన కూలిపోవడం వల్ల ఆ గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భారీ వర్షాల ప్రభావంతో, రుద్రప్రయాగ్, బాగేశ్వర్, చమోలి, హరిద్వార్ వంటి జిల్లాల్లోని విద్యాలయాలను తాత్కాలికంగా మూసివేశారు.

వివరాలు 

సహాయక చర్యలకు పెద్ద ఆటంకం 

రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ పరిస్థితులను గమనించి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రుద్రప్రయాగ్‌లోని బాసుకేదర్ తహసీల్, చమోలి జిల్లాలోని దేవల్ ప్రాంతాల్లో మేఘ విస్ఫోటం కారణంగా అనేక కుటుంబాలు వరదల్లో చిక్కుకుపోయాయని చెప్పారు. నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కారణంగా సహాయక చర్యలకు పెద్ద ఆటంకం ఎదురవుతోందని ఆయన తెలిపారు. వరద ప్రవాహం ప్రమాద స్థాయికి చేరువలో ఉండటం వలన, పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారని, అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారని చెప్పారు.

వివరాలు 

ఆకస్మిక వరదలతో తప్పించుకొనే మార్గం లేకపోయింది 

వరదల ధాటికి ప్రజలు మాత్రమే కాక, అడవుల్లో నివసిస్తున్న మూగజీవులు కూడా పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నాయని అటవీ అధికారులు తెలిపారు. వరదల్లో గల్లంతైన వారి గురించి కచ్చితమైన సమాచారం లేకపోయినా చాలామంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపారు. ఆకస్మిక వరదలు ఎదుర్కోవడానికి ఇంతవరకు ఎలాంటి మార్గం లేకపోవడం పరిస్థితిని మరింత భయంకరంగా మారుస్తోంది. ఇక కొన్ని రోజుల క్రితం ఉత్తరాఖండ్‌లోని రాంనగర్ పెద్ద కాలువలో వరద నీటి ధాటికి చిరుత పులి కొట్టుకుపోతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. అలాగే, గ్రామాల్లోని జంతువులు, పశువులు కూడా భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మందాకినీ నది ఉగ్రరూపం 

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వరద నీటిలో చిరుత