Chandra Babu: ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. చెత్త పన్ను రద్దు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు. చెత్త పన్నును రద్దు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. ఈ మేరకు ఎక్కడా చెత్త పన్ను వసూలు చేయకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని మచిలీపట్నంలో జరిగిన స్వచ్ఛతే సేవ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. గాంధీ అహింసా సిద్ధాంతంతో ముందుకు నడిచారని, బానిసత్వం వద్దు, స్వాతంత్య్రమే ముద్దు అని చెప్పారని చంద్రబాబు కొనియాడారు. 2014 అక్టోబర్ 2న ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్‌కు శ్రీకారం చుట్టారని, ఈ కార్యక్రమానికి అభినందనలు తెలియజేయాలని చెప్పారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో సానుకూల భాగస్వామ్యం కోసం నీతి ఆయోగ్‌లో ఏర్పాటు చేసిన ఉపసంఘానికి చంద్రబాబు ఛైర్మన్‌గా ఉన్నారని ఆయన తెలిపారు.
పింగళి వెంకయ్య పేరు మీద వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తాం
చెత్త నుంచి సంపద సృష్టించే కార్యక్రమంలో 2 లక్షలకు పైగా వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించడంలో భాగస్వామ్యం ఉన్నట్లు చెప్పారు. 2019లో రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిందన్నారు. 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త రోడ్లపై పేరుకుపోయిందని తెలిపారు. ఏడాది వ్యవధిలో ఈ చెత్తను మొత్తం శుభ్రం చేయాలని మంత్రి నారాయణకు ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ను లక్ష్యంగా తీసుకొని ముందుకు సాగాలని, 2029 నాటికి ఈ లక్ష్యానికి చేరుకోవాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులుగా మారి, రోడ్లపై చెత్త ఉండకుండా చూడాలని కూడా కోరారు. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య పేరు మీద ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు.