Andhra Pradesh: ఏటా రూ.3,000 కోట్ల వడ్డీ భారం తగ్గేలా! రుణాల రీఫైనాన్సింగ్‌కు ప్రభుత్వం కసరత్తు
ఈ వార్తాకథనం ఏంటి
భారీ రుణభారంతో ప్రతియేటా అసలు, వడ్డీ చెల్లింపుల కోసం పెద్దమొత్తం ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, తాజా పరిస్ధితుల్లో రుణాల రీఫైనాన్సింగ్‌కు ప్రయత్నిస్తోంది.
ఈ ప్రక్రియ ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 3,000 కోట్ల వరకు వడ్డీ భారం తగ్గించుకునే అవకాశం ఉందని ఆర్థికశాఖ లెక్కలు చెప్పింది.
రాష్ట్ర రుణాల రీఫైనాన్సింగ్‌కు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రితో చర్చించారు.
ముఖ్యకార్యదర్శి పీయూష్‌కుమార్ ఈ ప్రతిపాదనలను కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శులకు సమర్పించారు, దీనికి సానుకూల స్పందన వచ్చింది.
వివరాలు
వడ్డీ రేటు 7% లోపే
రుణాల రీఫైనాన్సింగ్ ప్రక్రియ వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముగుస్తుందని, తద్వారా వడ్డీ భారం తగ్గుతుందని ఆర్థికశాఖ అధికారులు తెలిపారు.
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రస్తావించారు.
గత ఏడాది జూన్‌లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడే నాటికి రుణాలు, పెండింగ్ బిల్లుల భారం కలిపి మొత్తం రూ.10 లక్షల కోట్ల వరకు ఉందని ప్రభుత్వం వెల్లడించింది.
మొత్తం అప్పుల్లో రూ.5 లక్షల కోట్లకు పైగా రిజర్వ్ బ్యాంక్ ద్వారా తెచ్చుకున్న బహిరంగ మార్కెట్ రుణాలే ఉన్నాయి.
వీటి వడ్డీ రేటు 7% లోపే ఉందని ఆర్థికశాఖ వివరించింది.అదనంగా, రూ. 2.50 లక్షల కోట్ల కార్పొరేషన్ రుణాలు ఉన్నాయి, వీటి వడ్డీ రేటు 12-13% వరకు ఉంది.
వివరాలు
వడ్డీలను తగ్గించడంపై చర్యలు
అలాగే, ఇతర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల మొత్తం రూ. 70-80 వేల కోట్ల వరకు ఉంటుందని, తక్కువ వడ్డీ రేటుతో తీసుకున్నప్పటికీ గత ప్రభుత్వ హయాంలో సరిగా చెల్లించకపోవడం, ఇతర కారణాలతో ఇవి 11% వరకు పెరిగిపోయాయని ఆర్థికశాఖ గుర్తించింది.
ఈ నేపథ్యంలో కార్పొరేషన్ల రుణాల వడ్డీ తగ్గించడం, ఇతర బ్యాంకుల వద్ద 11% వడ్డీని 9%కు తగ్గించడంపై ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఈ ప్రతిపాదనలను ఆర్థికశాఖ కార్యదర్శి కేంద్ర అధికారులతో చర్చించారు.
బ్యాంకులను సంప్రదించి వడ్డీలను తగ్గించడంపై చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాక, మారటోరియం పరిమితిని సవరిస్తూ ముందుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి.