Modi-Chandrababu:ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. రాష్ట్ర అభివృద్ధి, నిధులపై కీలక చర్చలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం దిల్లీలో పర్యటిస్తున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం నుంచి దిల్లీకి బయలుదేరిన ఆయన, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అమరావతి అభివృద్ధి, పోలవరం ప్రాజెక్ట్ నిధులు, రహదారుల అభివృద్ధి, రైల్వే జోన్ శంకుస్థాపన, విశాఖ స్టీల్ ప్లాంట్ విలీనం వంటి కీలక అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. విభజన హామీలపై కూడా ప్రధానమంత్రి మోదీతో మాట్లాడినట్లు సమాచారం.
అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక చర్చ
ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, పెట్రోలియం మంత్రి హర్‌దీప్ సింగ్ పురీ, హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా భేటీ కానున్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల నిధుల మంజూరు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక చర్చలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ భేటీల ద్వారా రాష్ట్రానికి అవసరమైన నిధులు కేటాయించడంలో మంచి పురోగతి సాధిస్తారని రాష్ట్ర వర్గాలు ఆశిస్తున్నాయి.