Page Loader
CM Chandrababu: 100 కౌంట్‌ రొయ్య కిలోకు రూ.220.. ఎగుమతి వ్యాపారులకు సీఎం సూచన 
100 కౌంట్‌ రొయ్య కిలోకు రూ.220.. ఎగుమతి వ్యాపారులకు సీఎం సూచన

CM Chandrababu: 100 కౌంట్‌ రొయ్య కిలోకు రూ.220.. ఎగుమతి వ్యాపారులకు సీఎం సూచన 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 08, 2025
08:35 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా విధించిన సుంకాల భారం పేరుతో రొయ్యలకు ఇచ్చే ధరలు తగ్గించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ముఖ్యంగా 100 కౌంట్‌ రొయ్యలకు కనీసం కిలోకు రూ.220 చెల్లించాల్సిందిగా ఆక్వా ఎగుమతి వ్యాపారులకు సూచించారు. అమెరికా సుంకాల భారాన్ని అధిగమించడమే కాకుండా, ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు సమాధానాలు కనుగొనడానికి అధికారులను ఒక 11 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కమిటీలో ఆక్వా రైతులు, రంగ నిపుణులు, ప్రభుత్వ ప్రతినిధులు, భాగస్వాములు, ఎంపెడా ప్రతినిధులు, ఎగుమతిదారులు ఉంటారు. అంతేకాకుండా, గోదావరి జిల్లాల్లోని ఆక్వా చెరువులకు కాలువల ద్వారా నీరు సరఫరా చేస్తామని కూడా హామీ ఇచ్చారు.

వివరాలు 

మత్స్యరంగం రాష్ట్ర జీడీపీలో కీలకం

సోమవారం రాత్రి సచివాలయంలో దాదాపు 2.30 గంటలపాటు జరిగిన విస్తృత సమావేశంలో సీఎం వివిధ అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో రైతులు, ఎగుమతి వ్యాపారులు, హేచరీల ప్రతినిధులు, మేత తయారీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. రైతుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్న సీఎం, దీర్ఘకాలికంగా స్థానిక వినియోగాన్ని పెంపొందించడం, ఉత్పత్తికి అదనపు విలువ జోడించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మత్స్యరంగం రాష్ట్ర జీడీపీలో కీలకంగా ఉన్నదని గుర్తుచేస్తూ,సుంకాల ప్రభావంతో ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని అధిగమించేందుకు అన్ని రకాలుగా ప్రభుత్వం మద్దతు ఇస్తుందని భరోసా ఇచ్చారు. ఎగుమతి వ్యాపారులు కూడా 100 కౌంట్‌ రొయ్యలకు రూ.220 ధర చెల్లించడానికి అంగీకరించారు.

వివరాలు 

కొత్త మార్కెట్లపై చర్చ

దక్షిణ కొరియా, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలతో ఉచిత వాణిజ్య ఒప్పందాలు (ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు) చేసుకుంటే మంచి అవకాశాలు కలుగుతాయని ఎగుమతిదారులు అభిప్రాయపడగా, దీనిపై కేంద్రంతో చర్చిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్రానికి తెలియజేశామని, మళ్లీ సంప్రదిస్తామని పేర్కొన్నారు. ఆక్వా రంగంలో 3 లక్షల మంది రైతులు నేరుగా పాల్గొంటున్నారు, పరోక్షంగా మరో 50 లక్షల మంది జీవనాధారం పొందుతున్నారు. ఇలాంటి సమయంలో రైతులు ధైర్యంగా ఉండాలని, సమస్యకు సమాధానం ఖచ్చితంగా తీసుకొస్తామని సీఎం భరోసా ఇచ్చారు.

వివరాలు 

ధరలపై చర్చించే కమిటీ

రైతులు మేత ధర తగ్గించాలని కోరగా, ఈ అంశంపై చర్చించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటవుతుందని సీఎం తెలిపారు. ఈ కమిటీలో ధరలతో పాటు ఇతర సమస్యలపై కూడా చర్చ జరుగుతుందని అప్సడా వైస్‌ ఛైర్మన్‌ ఆనం వెంకటరమణారెడ్డి వెల్లడించారు. రైతులకు భరోసా కలిగించేందుకు ఎగుమతి వ్యాపారులతో కలిసి నేరుగా వారిని కలవాలని సీఎం సూచించిన నేపథ్యంలో, మంగళవారం నుంచి జరగాల్సిన రైతు సదస్సులను రద్దు చేసినట్లు ప్రకటించారు.

వివరాలు 

కమిటీ సభ్యుల వివరాలు

రైతుల తరఫున: కె.రఘు, కుమారరాజు, రామరాజు (ఏపీఐఐసీ ఛైర్మన్), శ్రీకాంత్ ఎగుమతిదారుల తరఫున: కె.ఆనంద్, ఆనంద్ కుమార్, ఎన్.వెంకట్, డి.దిలీప్ హేచరీల తరఫున: పీవీబీ కుమార్, ఎస్‌ఎస్‌ఎన్ రెడ్డి ఫీడ్ మిల్లుల తరఫున: సుబ్రహ్మణ్యం ఈ కమిటీ రెండు మూడు రోజుల్లో చర్చలు ముగించుకుని నివేదిక ఇవ్వాలని సీఎం సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం కోసం ముందస్తుగా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పారు.