Chandrababu: కొత్త ఇంధన విధానంపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్'లో కొత్త ఇంధన విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 పేరిట నూతన విద్యుత్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానుంది. పునరుత్పాదక శక్తి లో 2014- 2019 మధ్య దేశంలోనే టాప్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్.. 2019 తరవాత గత ప్రభుత్వ విధానాలతో సంక్షోభంలోకి విద్యుత్ ఉత్పత్తి రంగం వెళ్లిందని అధికారులు చంద్రబాబుకు వివరించడంతో..గత ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ ఎనర్జీ, బయో ఎనర్జీకి ఉన్న అన్ని అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగేలా నూతన విధానం రూపొందించాలని సీఎం సూచించారు.
ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు తీసుకుకోవాల్సిన చర్యలపైనా చర్చ
పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా తక్కువ ఖర్చుతో,విద్యుత్ ఉత్పత్తయ్యే విధాన రూపకల్పనపై చర్చించారు. వీలైనంత తక్కువ సమయంలోనే పెట్టుబడులు,వినియోగదారులకు తక్కువ ధరకే విద్యుత్ సరఫరా చేసే విధంగా విధాన రూపకల్పనపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఇతర రాష్ట్రాలు,దేశాలలో సాంప్రదాయేతర విద్యుత్ తయారీకి అనుసరిస్తున్న పాలసీలను స్టడీ చేసి నూతన విధానానికి రూపకల్పన చేయాలన్నారు. 2029 నాటికి,2047 నాటికి విద్యుత్ అవసరాలు, తయారీ లెక్కించి పాలసీని రాష్ట్ర ప్రభుత్వం సిద్దం చేయనుంది. వచ్చేరోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు తీసుకుకోవాల్సిన చర్యలపైనా నూతన విధానంలో చర్చించారు. వ్యక్తులు,సంస్థలు సోలార్ విద్యుత్ తయారీ చేసుకోవడం మిగులు విద్యుత్ అమ్ముకోవడాన్ని సులభతరం చేసేలా విధానం ప్రభుత్వం తీసుకురానుంది. సోలార్ విద్యుత్ పానెళ్ల తయారీ పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించే అంశంపైనా కూడా చర్చించారు.