LOADING...
CM Chandrababu: బ్రాండ్ ఏపీ' ప్రచారంలో భాగంగా..  26న  సింగపూర్ పర్యటనకు సీఎం చంద్రబాబు 
బ్రాండ్ ఏపీ' ప్రచారంలో భాగంగా.. 26న సింగపూర్ పర్యటనకు సీఎం చంద్రబాబు

CM Chandrababu: బ్రాండ్ ఏపీ' ప్రచారంలో భాగంగా..  26న  సింగపూర్ పర్యటనకు సీఎం చంద్రబాబు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 25, 2025
03:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా,'బ్రాండ్‌ ఏపీ'ను ప్రపంచానికి పరిచయం చేయడం కోసం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు,మొత్తం ఆరు రోజుల పాటు సింగపూర్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా,ముఖ్యమంత్రి పలు ప్రముఖ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, యాజమాన్య బృందాలు,పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలంగా ఉన్న వనరులు,ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు,నూతన పారిశ్రామిక విధానాలు,భూముల లభ్యత,'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానాలు, నైపుణ్యాలు కలిగిన మానవ వనరుల లభ్యత వంటి అంశాలపై వారికి విపులంగా వివరాలు అందించనున్నారు. అలాగే, ఆ సంస్థల ప్రతినిధులను రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించనున్నారు.

వివరాలు 

తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం

పర్యటన ప్రారంభ రోజు,సింగపూర్‌తో పాటు సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రులతో నిర్వహించనున్న తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం పాల్గొంటారు. పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీ4 కార్యక్రమంలో భాగస్వాములవ్వాలని పారిశ్రామికవేత్తలతో పాటు ప్రవాసాంధ్రులను ఆయన కోరనున్నారు. ఈ ఏడాది నవంబర్‌లో విశాఖపట్టణంలో జరగబోయే పెట్టుబడుల సదస్సుకు విదేశీ పారిశ్రామికవేత్తలను కూడా ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా ఆహ్వానించనున్నారు. ఇందుకోసం ఆయన వివిధ దేశాల ప్రముఖులతో సమావేశమవుతారు.

వివరాలు 

 బిజినెస్ రోడ్‌షోకు సీఎం 

పోర్ట్ ఆధారిత ప్రాజెక్టులు, సెమికండక్టర్ పరిశ్రమ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్ల ఏర్పాటు వంటి కీలక రంగాలపై చంద్రబాబు వారి తో చర్చలు జరిపే అవకాశం ఉంది. అంతేకాకుండా, డిజిటల్ ఎకానమీ, ఫిన్‌టెక్ రంగాలపై సింగపూర్‌లో నిర్వహించనున్న బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. ఇంకా, సింగపూర్‌లో జరగబోయే బిజినెస్ రోడ్‌షోకు సీఎం హాజరవుతారు. ఆ దేశంలోని వివిధ మౌలిక వసతుల కేంద్రాలు, లాజిస్టిక్స్ హబ్‌లను కూడా సందర్శించనున్నారు. ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా ప్రకటించింది.