Chandrababu: ప్రకాశం బ్యారేజి వద్ద మరమ్మతు పనులను పరిశీలించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు నేటి సాయంత్రం ప్రకాశం బ్యారేజిని సందర్శించారు. అక్కడ జరుగుతున్న గేట్ల మరమ్మతు పనులను పరిశీలించారు. వరదల కారణంగా కొన్ని బోట్లు బ్యారేజి గేట్లను ఢీకొట్టడంతో, 67, 69 నెంబర్ గేట్లకు డ్యామేజి అయింది. ఈ నేపథ్యంలో, నిన్నె, దెబ్బతిన్న గేట్లకు కొత్త కౌంటర్ వెయిట్లు అమర్చారు, ఇంకా మిగిలిన మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో, ప్రకాశం బ్యారేజి వద్దకు వచ్చిన సీఎం చంద్రబాబు, ప్రాజెక్టు గేట్ల మరమ్మతుల నిపుణుడు కన్నయ్య నాయుడితో మాట్లాడారు. కొత్తగా అమర్చిన కౌంటర్ వెయిట్ల వద్ద జరుగుతున్న పనులపై ఆయన ఆరా తీశారు. అనంతరం, ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణా నది వరద ప్రవాహాన్ని పరిశీలించారు.
నాలుగు బోట్లు తొలగించాలి
కృష్ణానది ప్రవాహం గురించి ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. ఎగువ నుంచి భారీగా ప్రవాహం వస్తుందని ఇంజినీర్లు సీఎం గారికి వివరించారు. కౌంటర్ వెయిట్ల నిర్మాణంలో కృషి చేసిన వారికి సీఎం ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ప్రకాశం బ్యారేజీ పటిష్టత గురించి నివేదిక ఇవ్వాలని సీఎం సూచించారు అని కన్నయ్య నాయుడు తెలిపారు. డ్యామ్‌కు, గేట్లకు ఏవిధమైన ప్రమాదం జరగకుండా చూడటానికి, ప్రవాహానికి అడ్డుగా ఉన్న నాలుగు బోట్లు తొలగించాల్సిన అవసరముందని చెప్పారు.