Page Loader
మహారాష్ట్రలో తుపాకీ బెదిరింపు కలకలం.. సీఎం వర్గం ఎమ్మెల్యే కుమారుడే సూత్రధారి
సీఎం వర్గం ఎమ్మెల్యే కుమారుడే సూత్రధారి

మహారాష్ట్రలో తుపాకీ బెదిరింపు కలకలం.. సీఎం వర్గం ఎమ్మెల్యే కుమారుడే సూత్రధారి

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 10, 2023
03:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్ర రాజధాని ముంబైలో కిడ్నాప్ ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఓ మ్యూజిక్ కంపెనీ సీఈఓ (CEO) రాజ్‌కుమార్ సింగ్‌ అపహరణకు గురైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. మరోవైపు ఈ కిడ్నాప్ కేసులో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రకాశ్ సర్వే కుమారుడు రాజ్ సర్వే నిందితుడిగా ఉండటంపై రాజకీయ దుమారం రేగుతోంది. సర్వేతో పాటు మరికొంత మందిపై ఆ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యాపారవేత్త రాజ్‌కుమార్‌ సింగ్ పై ఎమ్మెల్యే తనయుడు తుపాకి ఎక్కుపెట్టి అతన్ని భయబ్రాంతులకు గురిచేసినట్లు బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని బయట ఎక్కడైనా చెబితే చంపుతామని బెదిరించినట్లు చెప్పారు.

DETAILS

డీల్ సెటిల్ చేసుకోవాలని బెదిరించారు : బాధితుడు రాజ్‌కుమార్‌ సింగ్

మ్యూజిక్ కంపెనీ ఉన్నతాధికారి రాజ్‌కుమార్‌ ను బలవంతంగా బయటకు తరలించినట్లు సీసీటీవీ(CCTV) కెమెరాల్లోని దృశ్యాలు బట్టబయలు చేశాయి. దాదాపు 10 నుంచి 15 మంది వరకు ముంబై గోరేగావ్‌లోని గ్లోబల్ మ్యూజిక్ కార్యాలయంలోకి దూసుకెళ్లిన నిందితులు, సదరు కంపెనీ సీఈవోను కిడ్నాప్ చేశారు. అంతుకుముందు కార్యాలయ సిబ్బందితోనూ ఘర్షణకు దిగినట్లు ఫుటేజీలో స్పష్టమైంది. అపహరణ అనంతరం దహిసార్‌లోని ఎమ్మెల్యే సర్వే కార్యాలయానికి తరలించారని, అక్కడ శాసనసభ కుమారుడు తనను తుపాకీతో బెదిరించినట్లు రాజ్‌కుమార్‌ వాపోయారు. పాట్నాకు చెందిన మనోజ్ మిశ్రాకు తనతో ఉన్న వ్యాపార లావాదేవీలు, బకాయిల వ్యవహారం నేపథ్యంలోనే ఈ అపహరణ చోటు చేసుకున్నట్లు బాధితుడు చెప్పారు. వెంటనే డీల్ ను క్లోజ్ చేసుకోవాలని భయబ్రాంతులకు గురిచేసినట్లు ఆయన ఆందోళన చెందుతున్నారు.