
ఆగస్టు 31నుంచి ముంబైలో 'ఇండియా' కూటమి సమావేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియా కూటమి మరోసారి సామావేశం కానుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై వేదికగా రెండు రోజుల పాటు భేటీ కానున్నారు. ఆగస్ట్ 31, సెప్టెంబరు 1న రెండు రోజుల ఈ సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
దేశంలోని విపక్ష పార్టీలన్నీ కలిసి I.N.D.I.A (ఇండియా కూటమి)గా ఏర్పడ్డ విషయం తెలిసిందే. కర్ణాటక రాజధాని బెంగళూరులో విపక్షాలు ఇటీవలే రెండో సమావేశం నిర్వహించారు.
రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధికార పక్షం ఎన్డీఏ (NDA)ను ఎదుర్కొనేందుకు విపక్షాల కూటమి సమయాత్తం అవుతోంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ముంబై వేదికగా సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
DETAILS
ముంబై సమావేశంలో కన్వీనర్‌ను ఎంపిక చేయనున్న విపక్షాలు
గతంలో లాగే ఈసారీ రెండు రోజుల పాటు కీలక చర్చలు జరపనున్నారు. ఈ మేరకు ముంబై మహానగరంలోని ఓ హోటల్ లో ఈ భేటీని నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. రెండు రోజుల పాటు సాగనున్న ఈ సమావేశాలకు ఆ రాష్ట్రంలోని శివసేన (ఠాక్రే), శరద్ పవార్ (NCP) పార్టీలు కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు తీసుకోనున్నాయి.
విపక్షాల మొట్టమొదటి సమావేశం పాట్నలో జరగ్గా, కీలక రెండో సమావేశం బెంగళూరులో జరిగింది.
కూటమి సమన్వయం కోసం 11 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పరచనున్నట్లు బెంగళూరు సమావేశంలోనే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ప్రకటించారు.
మూడో సమావేశం ముంబైలో జరగనున్న సందర్భంగా కన్వీనర్‌ను సైతం ఎంపిక చేస్తామని గతంలోనే స్పష్టం చేశారు.