Page Loader
Revanth Reddy: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిరోధానికి సిట్‌ ఏర్పాటు 
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిరోధానికి సిట్‌ ఏర్పాటు

Revanth Reddy: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిరోధానికి సిట్‌ ఏర్పాటు 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 26, 2025
04:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ అంతర్జాతీయ నేరంగా మారిందని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, రమ్మీపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ అక్రమాలను అరికట్టేందుకు, పూర్తిగా నిషేధించేందుకు స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌) ఏర్పాటు చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. అలాగే, ఇలాంటి నేరాలకు సంబంధించి శిక్షలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో మాట్లాడిన ఆయన, బెట్టింగ్, రమ్మీ వంటి అంశాలను తీవ్రంగా పరిగణిస్తున్నామని స్పష్టం చేశారు.

వివరాలు 

బెట్టింగ్‌, రమ్మీపై చర్యలు తప్పవు 

''గుట్కా వంటి నిషేధిత పదార్థాల సరఫరా పెరుగుతోందని సమాచారం ఉంది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, రమ్మీ ప్రచారం కల్పించిన వారిని విచారించాం. అయితే, కేవలం ప్రచారాన్ని నిలిపివేయడమే సమస్యకు పరిష్కారం కాదని స్పష్టమైంది. అందుకే, సిట్‌ను ఏర్పాటు చేసి ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించాం. ఎవరైనా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ లేదా ఇతర నేరాల్లో భాగస్వామ్యం అయ్యారు అంటే చర్యలు తప్పవు'' అని సీఎం రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు.

వివరాలు 

న్యాయవాద దంపతుల హత్య

''శాంతిభద్రతల విషయంలోనూ కొన్ని విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వం ఈ అంశంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో అందరికీ తెలుసు. దిశ ఘటన, న్యాయవాద దంపతుల హత్య వంటి సంఘటనలు గత పాలనలో జరిగిన అసలు పరిస్థితిని బయటపెడతాయి. నడిరోడ్డుపై న్యాయవాద దంపతులను హత్య చేసినా ఇప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదు. సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై జరిగిన అమానుష ఘటనపై కూడా ఆ ప్రభుత్వం నిష్క్రియంగా వ్యవహరించింది. మహిళలపై దాడుల పరంగా గత పాలనలో తెలంగాణ దేశంలో నాలుగో స్థానంలో ఉంది. జూబ్లీహిల్స్‌ పబ్‌ ఘటనలో భారాస నాయకుడి కుమారుడి ప్రమేయం ఉన్నా పట్టించుకోలేదు.

వివరాలు 

శాంతిభద్రతల విషయంలో రాజీపడ్డామా?

ఒక మంత్రి కుమారుడి ప్రమేయం ఉందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు శాంతిభద్రతల విషయంలో తప్పుడు ప్రచారం చేసి పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కుప్పకూలిపోయిందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రం దివాలా తీయాలని భారాస నేతలు కోరుకుంటున్నారా? అధికార దాహంతో అసత్య ప్రచారాలను విస్తరిస్తారా? గత 15 నెలల పాలనలో ఎక్కడైనా శాంతిభద్రతల విషయంలో రాజీపడ్డామా?'' అని సీఎం రేవంత్‌ ప్రశ్నించారు. ''ధరల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉంది. 85 శాతం స్వంత పన్నుల వసూళ్లతో రాష్ట్రం ముందంజలో ఉంది. కానీ, కొందరు కడుపు మండిపోతూ విమర్శలు చేస్తున్నారు.

వివరాలు 

భారాస నేతల ఆరోపణలపై సీఎం స్పందన 

గతంలో జానారెడ్డి విపక్ష నేతగా ఉండగా, ప్రభుత్వానికి సహకరించారు. అదే సంప్రదాయాన్ని కొనసాగించలేరా? ఎన్నికలు 2029లోనే జరుగుతాయి. మీరు కోరుకుంటే ఇప్పుడే ఎన్నికలు రావు. భారాస నేతలు ఇద్దరు పోటీపడి మరీ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాళ్ల పోటీ వల్ల మాకు తలనొప్పి వస్తోంది. నేను పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటాను.గజ్వేల్‌ ఎమ్మెల్యే నా దగ్గరకు వచ్చినా సహాయ సహకారాలు అందిస్తాను. పద్మారావు వచ్చారు,కొన్ని నియోజకవర్గ పనుల గురించి అడిగారు.వెంటనే ఆ పనులను అంగీకరించాను. విపక్ష ఎమ్మెల్యేలు వచ్చినా, ప్రజలకు మేలు జరిగే పనులు చేస్తూనే ఉంటాను'' అని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.