PRTS: హైదరాబాద్‌లో మూడు పీఆర్టీఎస్ కారిడార్లకు సీఎం రేవంత్ ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగరంలో ఆధునిక రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాడ్ కార్లతో నడిచే పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (పీఆర్టీఎస్) ఏర్పాటుకు మూడు కారిడార్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదించారు. ఈ మూడు మార్గాలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను డిసెంబరు నాటికి పూర్తి చేయాలని మెట్రోరైలు అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీఈలోని బోధి పెవిలియన్‌లో గురువారం పీఆర్టీఎస్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. న గరంలో పీఆర్టీఎస్ మార్గాల ఎంపికపై లీ అసోసియేట్స్ రూపొందించిన అధ్యయన నివేదికను ఇటీవల మెట్రో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆ సందర్భంగా సీఎం పలు సూచనలు చేశారు. వాటికి అనుగుణంగా మార్పులు చేసి మూడు కారిడార్లను ఖరారు చేశారు.
వివరాలు
మూడు కారిడార్లు ఇవే..
కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ నుంచి దుర్గం చెరువు, రహేజా మైండ్‌స్పేస్, బయోడైవర్సిటీ మెట్రో స్టేషన్ వరకు మొదటి కారిడార్ ఏర్పాటు చేయనున్నారు.
ఈ మార్గం పనులను వెంటనే ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.
గచ్చిబౌలిలోని ఐకియా సమీపంలో బహుళ అంతస్తుల పార్కింగ్ కేంద్రాన్ని నిర్మించి, అందులోనే పీఆర్టీఎస్ డిపో ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ కారిడార్ నిర్మాణాన్ని ఏడాదిలోగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
రెండో కారిడార్‌ను ఎల్బీ స్టేడియం నుంచి ప్రారంభించి.. అంబేడ్కర్ విగ్రహం, ఇందిరాపార్క్, లోయర్ ట్యాంక్‌బండ్ మీదుగా రాణిగంజ్ బస్‌స్టాండ్ వరకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
వివరాలు
మూడు కారిడార్లు ఇవే..
మూడో కారిడార్ అసెంబ్లీ మెట్రో స్టేషన్ నుంచి రవీంద్రభారతి, సెక్రటేరియట్, ఐమాక్స్ మీదుగా బేగంపేట్ వరకు కొనసాగనుంది.
ఈ మార్గానికి సంబంధించి నెక్లెస్ రోడ్‌లో బహుళ అంతస్తుల పార్కింగ్ కేంద్రాన్ని నిర్మించి, అందులో పీఆర్టీఎస్ డిపో ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో సీఎంవో కార్యదర్శి మాణిక్‌రాజ్, హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, మెట్రో అదనపు ఎండీ అజిత్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్, సీఎంసీ కమిషనర్ సృజన, ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్ శశాంక తదితరులు పాల్గొన్నారు.