
Telangana: ఉగాది కానుకగా రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం.. సీఎం రేవంత్ రెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీకి రంగం సిద్ధమైంది.
ఈ పథకాన్ని ఇవాళ సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
లబ్ధిదారులకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేసేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ ఏర్పాట్లు చేశారు.
Details
సీఎం రేవంత్ హుజూర్‌నగర్ పర్యటన
ఈరోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి హెలికాప్టర్‌లో హుజూర్‌నగర్‌కు చేరుకుంటారు.
అక్కడ ఆసియా ఖండంలోనే అతి పెద్ద కాలనీ నిర్మాణ పనులను సీఎం పరిశీలిస్తారు. అనంతరం నేరుగా బహిరంగ సభాస్థలికి వెళ్లి రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తారు.
పేదల కోసం ఉచిత సన్న బియ్యం పథకం
ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని దాదాపు 84 శాతం పేదలకు ఉచితంగా సన్న బియ్యం అందించనున్నారు.
ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అర్హులందరికీ సన్న బియ్యం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఇప్పటివరకు పంపిణీ చేస్తున్న దొడ్డుబియ్యం స్థానంలో ఇకపై సన్న బియ్యం పంపిణీ చేయనుంది.
Details
ప్రభుత్వంపై రూ.2,800 కోట్ల అదనపు భారం
ఈ పథకాన్ని అమలు చేయడం వల్ల రాష్ట్రంపై రూ.2,800 కోట్ల అదనపు భారం పడనుంది.
పేదలకు సన్న బియ్యం అందించేందుకు ఏటా 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం.
దీనికోసం ప్రభుత్వం ఏడాదిలో రెండు సీజన్లలో 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి, బియ్యంగా మార్చి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయనుంది.
Details
లబ్ధిదారుల సంఖ్య పెరిగే అవకాశం
ప్రస్తుతం తెలంగాణలో 89.95 లక్షల రేషన్ కార్డులుండగా, వీటి ద్వారా 2.81 కోట్ల మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించడంతో లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని పేదలకు ఆహార భద్రతను మరింత పటిష్ఠంగా అందించనుంది.